TS SSC Results 2024: తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం ఏప్రిల్ 24న ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంక‌నం పూర్త‌యింద‌ని, డీకోడింగ్ ప్ర‌క్రియ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంద‌ని ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్లు ఇంట‌ర్మీడియట్ ఫ‌లితాల విడుద‌ల సంద‌ర్భంగా.. ఈ విష‌యాన్ని విద్యాశాఖ కార్య‌ద‌ర్శి బుర్రా వెంక‌టేశం తెలిపారు. 


ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వ‌ర‌కు 2,676 ప‌రీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది 5,08,385 మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఏప్రిల్ 3 నుంచి జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 20తో మూల్యాంకనం పూర్తైంది. రాష్ట్రంలో 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in తోపాటు https://telugu.abplive.com//amp వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచనున్నారు.


గతేడాది తెలంగాణ‌లో ఏప్రిల్ 3 ఏప్రిల్ 13 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను మే 10న విడుద‌ల చేశారు. అయితే ఈ సారి లోక్ స‌భ ఎన్నిక‌ల నేపథ్యంలో..  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు. గతేడాది ఫలితాల ప్రకటనకు 27 రోజుల సమయం పట్టింది. ఈసారి కూడా 27 వ్యవధిలోనే ఫలితాలను ప్రకటించనున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు తొందరగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులుకాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. 


ఏపీలో పది ఫలితాలు ఇప్పటికే విడుదల..
ఏపీలో పదోతరగతి ఫలితాలు ఏప్రిల్‌ 22న వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 5,34,574 (86.69 %) విద్యార్థలు అర్హత సాధించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. పాసైనవారిలో 89.17 శాతం బాలికలు, 84.32 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో మొదటి స్థానంలో నిలవగా.. 62.47 శాతంతో కర్నూలు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఫలితాల్లో ఎప్పటిలాగే బాలికలే పైచేయి సాధించారు. అయితే ఈ ఏడాది టెన్త్ ఫలితాల్లో ఇదివరకెప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డు సాధ్యమైంది. ఏలూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పదోతరగతి ఫలితాల్లో ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కులకు గాను.. 599 మార్కులు సాధించింది. పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30 వరకు సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.50 ఆలస్య రుసుముతో మే 1 నుంచి 23 వరకు ఫీజు చెల్లించవచ్చు. త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల పూర్తిస్థాయి టైమ్‌టేబుల్‌ను అధికారులు వెల్లడించనున్నారు.


ALSO READ:


తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్ష ఫలితాలు నేడు (ఏప్రిల్ 24న) వెలువడ్డాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్, నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం పాసయ్యారని అధికారులు వెల్లడించారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ తోపాటు ఏబీపీ దేశంవెబ్‌సైట్‌లోనూ చూసుకోవచ్చు. 


ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి 


ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి