తెలంగాణలో 2021-22 విద్యా సంవత్సరాన్ని ఖరారు చేస్తూ.. రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పనిదినాలు ఉంటాయని తెలిపింది. తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1కి ముందు నిర్వహించిన 47 రోజుల ఆన్‌లైన్ తరగతులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఇక దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి 17 వరకు ఉంటాయని వెల్లడించింది.
మిషనరీ పాఠశాలల్లో చదివే వారికి క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 22 నుంచి 28 వరకు ఉంటాయని తెలిపింది. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు ఇవ్వనున్నట్లు విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, కోవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా దేశంలో పాఠశాలలు మూతపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గడంతో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.
ఏపీ అకడమిక్ క్యాలెండర్‌లో కీలక మార్పులు
కోవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నూతన విద్యాసంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక మార్పులను చేసింది. 2021-22 ఏడాది సిలబస్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం.. 3 నుంచి 9 తరగతుల వారి సిలబస్ 15 శాతం తగ్గనుంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు 20 శాతం సిలబస్ తగ్గుతుంది. కోవిడ్ కారణంగా చాలా రోజులు తరగతులు జరగకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల పని దినాలకు సంబంధించిన అకడమిక్ కేలండర్ కూడా తగ్గించింది. దీనికి 31 వారాల నుంచి 27 వారాలకు కుదించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈసారి రెండు భాగాలుగా అకడమిక్ కేలండర్ రూపొందించినట్లు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు తెలిపారు. ఏపీలో ఆగస్ట్ 16 నుంచి పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో కోవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.