తెలంగాణలో డిప్లొమా కోర్సులకు సంబంధించి ఫీజుల నియంత్రణపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు జూన్ 16న ఆదేశించింది. డిప్లొమా కోర్సులను ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలని గతేడాది ఫిబ్రవరిలో సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా.. దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రారంభమైనందున ఫీజులు పెంచాలని హైకోర్టులో ఐదు ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ విద్యాశాఖ కార్యదర్శి స్పందించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.


ఈ అంశంపై వారం రోజుల్లోగా విద్యాశాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. విద్యాశాఖ కార్యదర్శి ఏ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించింది. 


పాలిటెక్నిక్ కాలేజీలు కోరినట్లుగా ఫీజుల పెంపునకు అనుమతించక తప్పడం లేదని పేర్కొంది. డిప్లొమా కోర్సుల ఫీజును రూ.40వేలకు పెంచేందుకు 5 పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


ఏఎఫ్‌ఆర్‌సీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించింది. ప్రభుత్వం తక్కువగా ఫీజు ఖరారు చేస్తే అదనంగా చెల్లించిన సొమ్మును విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు షరతు విధించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.


Also Read:


తెలంగాణ ఓపెన్‌ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
తెలంగాణ ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ స్కూల్ సొసైటీ జూన్ 16న ఫలితాలను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబరు లేదా రూల్ నంబర్‌ వివరాలు నమోదుచేసి మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 25 నుంచి మే 4 వరకు పదోతరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 25 నుంచి మే 3 వరకు పదోతరగతి పరీక్షలు, ఏప్రిల్ 25 నుంచి మే 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మే 12 నుంచి 19 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి..


'దోస్త్'లకు సీట్ల కేటాయింపు, తొలి విడతలో 73,220 మందికి ప్రవేశాలు!
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల‌కు సంబంధించి విద్యార్థులకు 'దోస్త్' తొలిదశ సీట్లను కేటాయించారు. మొద‌టి విడత‌లో 73,220 మంది సీట్లు కేటాయించిన‌ట్లు ఉన్నత విద్యామండ‌లి జూన్ 16న ఒక ప్రకటనలో తెలిపింది. సీట్లు పొందిన విద్యార్థుల్లో 44,113 మంది అమ్మాయిలు, 29,107 మంది అబ్బాయిలు ఉన్నారు. దోస్త్‌ ద్వారా ప్రవేశాలకు అందుబాటులో 889 కళాశాలలు ఉండగా.. వాటిల్లో  మొత్తం సీట్లు 3,56,258 సీట్లు ఉన్నాయి. ఇక 63 కళాశాలల్లో ఎలాంటి ప్రవేశాలు జరుగలేదు. డిగ్రీ కామ‌ర్స్ కోర్సుల్లో చేరేందుకే విద్యార్థులు సుముఖ‌త చూపించడం విశేషం. మొత్తం 33,251 మంది విద్యార్థులు కామ‌ర్స్ కోర్సుల‌ను ఎంపిక చేసుకున్నారు. సీట్లు పొందిన విద్యార్థుల జూన్ 16 నుంచి 25 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..