TGCET 2024 Merit List 2024: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల ప్రక్రియను జూన్ మొదటి వారంలోగా పూర్తిచేయాలని గురుకుల పాఠశాలల సంక్షేమ సొసైటీలు నిర్ణయించాయి. ప్రవేశ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఇప్పటికే మొదటి విడత ప్రవేశ ప్రక్రియ పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే మిగిలిన సీట్ల భర్తీకి రెండు, మూడు రోజుల్లో రెండోవిడత ప్రవేశాల జాబితాను వెల్లడించనున్నాయి. మే నెలాఖరు నాటికి రెండో విడత కౌన్సెలింగ్ ముగించి, జూన్ మొదటివారానికి ప్రవేశాలు పూర్తిచేయాలని యోచిస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల పరిధిలో మొత్తం 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశాల కోసం నిర్వహించిన రాతపరీక్షకు మొత్తం 1.13 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన సొసైటీలు తొలిదశ ఎంపిక జాబితాలను ప్రకటించాయి. సంబంధిత పాఠశాలల్లో చేరేందుకు మే 6 వరకు అవకాశం కల్పించింది. మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా గురుకులాల్లో దాదాపు 80 శాతం సీట్లు భర్తీకాగా.. మిగిలిన 20 శాతం సీట్ల భర్తీకి విద్యార్థుల మెరిట్ ఆధారంగా రెండో జాబితాను వెల్లడించనున్నారు. ఇక రెండోవిడత ప్రవేశాల తర్వాత కూడా మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష రాసిన, రాయలేకపోయిన విద్యార్థుల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి గతేడాది డిసెంబరు 15న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(TSWREIS) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా బీసీ (MJPTBCWREIS), ఎస్సీ ( TSWREIS), ఎస్టీ (TTWREIS), బీసీ (MJPTBCWREIS) గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలు పొందడానికి అర్హులు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు గడువు డిసెంబరు 18 నుంచి 2024, జనవరి 20 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారకం విద్యార్థులకు ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికచేసిన కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో విద్యార్థులు కనబరిచిన ప్రతిభ, రిజర్వేషన్లకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సొసైటీల కింద మొత్తం 643 గురుకులాల్లో 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లకు భారీ పోటీ ఉంటోంది.
ప్రవేశపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు ఉంటాయి. ఇందులో తెలుగు-20 మార్కులు, ఇంగ్లిష్-25 మార్కులు, గణితం-25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ-10 మార్కులు, పరిసరాల విజ్ఞానం-20 మార్కులు ఉంటాయి. నాలుగో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి.
గురుకులాల్లో సీట్ల వివరాలు ఇలా..
సొసైటీ | బాలికల గురకులాలు | బాలుర గురుకులాలు | సీట్ల సంఖ్య |
ఎస్సీ గురుకులాలు | 141 | 91 | 18,560 |
ఎస్టీ గురుకులాలు | 46 | 36 | 6,560 |
బీసీ గురుకులాలు | 146 | 148 | 23,680 |
సాధారణ సొసైటీ | 20 | 15 | 3,124 |
మొత్తం సీట్లు | 353 | 290 | 51,924 |