తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న 'టీఎస్ ఎంసెట్' ప్రవేవ పరీక్షకు సిద్ధమవుతున్న నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం 'టీశాట్' ద్వారా ఎంసెట్ కోచింగ్ ప్రారంభించింది. రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు శిక్షణ తరగతులు ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమయ్యాయి. ఎంసెట్‌ రాయాలనుకుంటునన పేద విద్యార్థులకు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకునే స్తోమత ఉండదు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.


రాష్ట్రంలోని కస్తూర్బా విద్యాలయాల ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల రచయితలు, నిపుణులతో టీ శాట్ ద్వారా రోజూ ఉదయం, సాయంత్రం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎంసెట్ నిర్వహించే నాటికి సిలబస్ పూర్తయ్యేలా టైంటేబుల్ కూడా రూపొందించారు. శిక్షణ తీసుకుంటున్న ప్రతి విద్యార్థినికి ప్రత్యేక కోడ్ నంబరు కేటాయించి పీజీసీఆర్టీకి అనుసంధానించారు.


దరఖాస్తుకు ఏప్రిల్ 10తో ఆఖరు, ఆపై ఫైన్‌తో... 


తెలంగాణలో ఎంసెట్ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగియనుంది. అయితే రూ.250 - రూ.5000 వరకు ఆలస్య రుసుముతో ఏప్రిల్ 15 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి  ఎంసెట్‌కు భారీగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగానికి కలిపి 2.66 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు ఇంకా నాలుగు రోజులు ఉండగానే ఆ సంఖ్యను దాటింది. ఏప్రిల్ 6న సాయంత్రం వరకు 2,70,164 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు నాటికి ఈ సంఖ్య మరికొన్ని వేలు పెరిగే అవకాశం ఉందని ఎంసెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇంతవరకు 95,344 అగికల్చర్, ఫార్మసీకి వచ్చాయి. మిగిలిన 1,74,820 మంది ఇంజినీరింగ్‌కు హాజరుకానున్నారు. 


బీటెక్‌లో కొత్త కోర్సులు వస్తుండటం, ఉద్యోగావకాశాలు పెరుగుతున్నందున విద్యార్థులు ఎంసెట్‌కు పోటీపడుతున్నారని నిపుణుల అభిప్రాయం. ఈసారి ఏపీ నుంచి కూడా దరఖాస్తులు పెరిగాయని, ఇప్పటికే ఇంజినీరింగ్‌కు 39,628 మంది, అగ్రికల్చర్‌కు 15,967 మంది దరఖాస్తు చేసుకున్నారని ఎంసెట్ కో-కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి చెప్పారు. గతేడాది ఏపీ నుంచి ఇంజినీరింగ్‌కు 35 వేలు, అగ్రికల్చర్‌కు 16,200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.


ఎంసెట్ షెడ్యూలులో స్వల్పమార్పులు..
తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే వెల్లడించింది. కొత్త షెడ్యూలు ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్‌, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షల కారణంగా షెడ్యూల్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. అయితే.. మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.


దరఖాస్తు ఫీజు ఇలా..


దరఖాస్తు ఫీజుగా  ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1000 చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్, మెడిక‌ల్ ప్రవేశ ప‌రీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1000, మిగ‌తా కేట‌గిరిల అభ్యర్థులు రూ. 1800 చెల్లించాల్సి ఉంటుంది. 


ఎంసెట్‌ షెడ్యూల్‌ ఇలా..


➥ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ వెల్లడి:  28.02.2023


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.


➥ దరఖాస్తుకు చివరితేదీ (అపరాధ రుసుము లేకుండా): 10.04.2023. 


➥ దరఖాస్తుల సవరణ: 12.04.2023 - 14.04.2023.


➥ రూ.250 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.04.2023.


➥ రూ.1000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 20.04.2023.


➥ రూ.2500 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 25.04.2023.


➥ రూ.5000 అపరాధ రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 02.05.2023.


➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 30.04.2023 నుంచి


➥ పరీక్ష తేదీలు:  మే 12 నుంచి 14 వరకు ఇంజినీరింగ్; మే 10, 11 తేదీల్లో ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షలు.


Also Read:


టీఎస్‌ లాసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు, ఫైన్ లేకుండా చివరితేది ఎప్పుడంటే?
టీఎస్‌ లాసెట్‌ దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు లాసెట్‌ కన్వీనర్‌ గురువారం (ఏప్రిల్ 6) ఒక ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 20లోపు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్ 1న వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..