శీతల పానీయాల క్యాన్ లు ఇతర సాఫ్ట్ డ్రింక్ ప్యాక్ లు, ఇతర చక్కెరలు అధికంగా ఉన్న పదార్థాల ప్యాక్ ల మీద చట్టబద్ధమైన హెచ్చరికలు రాయాలేమో. వారానికి ఒకటి కంటే ఎక్కువ క్యాన్ల సాఫ్ట్ డ్రింక్స్ వినియోగించే వారు ప్రాణాంతక ప్రమాదాల బారిన పడే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా డైట్ ఎక్స్ పర్ట్స్ అంతా కూడా చక్కెరల వినియోగం గురించి చాలా అధ్యయనాలు చేస్తున్నారు. చక్కెర వినియోగం పెరిగితే ఆరోగ్యానికి ప్రమాదమని కూడా అధ్యయనాలు రుజువులు చూపుతున్నాయి. సాధారణ సాఫ్ట్ డ్రింక్ లో మోతాదుకు మించి చక్కెర ఉంటుంది. దీని వినియోగం వల్ల 45 రకాల విభిన్న అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని యూస్, చైనాకు చెందిన నిపుణులు హెచ్చిస్తున్నారు. వీటిలో డయాబెటిస్ నుంచి టూత్ కావెటీ వరకు రకరకాల అనారోగ్యాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రపంచ అరోగ్య సంస్థ సూచించినట్లు చక్కెర మోతాదు రోజుకు ఆరు టీస్పూన్లకు మించకుండా జాగ్రత్త పడాలనేది ఈ అధ్యయన సారాంశం. ఆరు టీస్పూన్లు దాదాపు 25 గ్రాముల వరకు బరువు తూగుతుంది. ఇంత చక్కెర నాలుగు కిట్ క్యాట్ ముక్కలు, సుమారు 150 మి.లీ.ల పండ్ల రసంలో ఉండే చక్కెరకు సమానం.


ఈ అధ్యయన సమీక్షలో ప్రతి రోజు తీసుకునే ఒక్కో సాఫ్ట్ డ్రింక్ కరోనరీ హార్ట్ డీసీజ్ వచ్చే ప్రమాదం 17 శాతం, గౌట్ 4 శాతం, మరణాని దగ్గరయ్యే ప్రమాదం 4 శాతం వరకు పెంచుతుందని తెలియజేస్తున్నారు. డయాబెటిస్, స్థూలకాయం వంటి మెటబాలిక్ సమస్యలకు డైటరీ షుగర్ వాడకానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా నిర్ధారిస్తున్నారు. బీపీ, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలతో పాటు రొమ్ము, ప్రొస్టేట్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తో సహా దాదాపు ఏడు క్యాన్సర్లకు కూడా మోతాదు మించిన డైటరీ షుగర్ వాడకం కారణం కావచ్చని గట్టిగా చెబుతున్నారు.


ఎక్కువగా వినియోగించే చక్కెరల వల్ల అస్తమా, పంటి సమస్యల నుంచి డిప్రెషన్ వంటి అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోందని బీఎంజేలో ప్రచురించిన అధ్యయన ఫలితాలు వివరిస్తున్నాయి. పండ్లు, పండ్ల రసాల్లో సహజంగా లభించే చక్కెర ఫ్రక్టోజ్. ఇది కూడా అదనంగా తీసుకునే ప్రతి 25 గ్రాములు 22 శాతం పాంక్రియాటిక్ క్యాన్సర్ కు దగ్గర చేస్తుంది. ఏది ఏమైనా చక్కెర వినియోగం రోజుకు 25 గ్రాములకు మించకుండా జాగ్రత్త పడడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


అంతేకాదు పిల్లలు, యువకుల్లో చక్కెర వినియోగానికి సంబంధించిన అవగాహన కల్పించడం ఇప్పుడు సమాజానికి ఉన్న ఆరోగ్య అవసరమని ఈ అధ్యయనకారులు చెబుతున్నారు. చక్కెరల వినియోగాన్ని తగ్గించాలని అనుకునే వారు కొన్ని చిన్నచిన్న విషయాలను గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ షుగర్స్ వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. కనుకు వీలైనంత వరకు చక్కెరల వాడకం తగ్గించుకోవాలి. ఎక్కువ చక్కెర తీసుకునే కొద్దీ నాలుక మీది టెస్ట్ బడ్స్ మరింత చక్కెర రుచి కావాలని అడిగే ప్రమాదం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు చక్కెరల వినియోగాన్ని తగ్గించుకోవడం ప్రస్తుత కాలంలో చాలా అవసరం. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగే కొద్దీ షుగర్ క్రేవింగ్స్ కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. చక్కెర వాడకం అదుపులో పెట్టుకోవడం అందరికీ అవసరమే అని గుర్తించాలి.


Also Read: పీడకలలు తరచూ వస్తున్నాయా? ప్రమాదం పొంచి ఉన్నట్టే


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.