Trending
JEE Advanced 2025: జేఈఈ అడ్వాన్స్‌డ్ రెండుసార్లే, వారికి మాత్రమే మూడో ఛాన్స్: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
JEE Advanced 2025: ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 పరీక్షను 2సార్లే నిర్వహించనున్నారు. మొదట మూడుసార్లు రాసుకోవచ్చని ప్రకటించి.. రెండుసార్లకే పరిమితం చేశారు.

JEE Advanced: దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్-2025 (JEE Advanced) మూడుసార్లు రాసుకోవచ్చని తొలుత ప్రకటించి రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నట్లు ఐఐటీ కాన్పూర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్లపై శుక్రవారం (జనవరి 10) విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced) పరీక్షను రెండుసార్లు రాసేలా జేఏబీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అదేవిధంగా.. ఐఐటీ కాన్పూర్ ప్రకటన నేపథ్యంలో 2024 నవంబర్ 5-18 తేదీల మధ్య కాలంలో తమ కోర్సుల నుంచి డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులకు ఉపశమనం కలిగించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్షకు వారు రిజిస్టర్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమంటూ పిటిషన్..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను మూడుసార్లు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు నవంబర్ 5న ఐఐటీ కాన్పూర్ నిర్ణయించింది. ఆ తర్వాత 18వ తేదీన జాయింట్ అడ్మిషన్ బోర్డు (జేఏబీ) యూటర్న్ తీసుకోవడంతో పలువురు అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల అర్హత ప్రమాణాల్లో చేసిన ఆకస్మిక మార్పులు పిటిషనర్లతో పాటు ఇలాంటి వేలాది మంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశించేందుకు విలువైన అవకాశాన్ని ప్రభావితం చేస్తాయని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అందులో తెలిపారు.
ఎప్పటిలాగే రెండుసార్లు..
ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 2013 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్ పేరిట పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి ఇంటర్ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది.. అంటే వరుసగా రెండుసార్లు మాత్రమే హాజరుకావొచ్చు. దాన్ని మూడుసార్లకు పెంచుతూ జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహణ బాధ్యత తీసుకున్న ఐఐటీ కాన్పూర్ గతేడాది నవంబర్ 5న ప్రకటించింది. పట్టుమని 15 రోజులు కాకముందే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. దీంతో గతంలో మాదిరిగానే రెండుసార్లు మాత్రమే ఈ పరీక్ష రాసుకోవచ్చు. వచ్చే మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్షల్లో పాసైనవారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులైనవారికి అవకాశం ఉండదు.
అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి నేరుగా సీట్లు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ ఒలింపియాడ్‌లో పాల్గొన్న విద్యార్థులకు ఐఐటీ కాన్పుర్‌లో నేరుగా బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. మ్యాథమెటిక్స్, ఇన్‌ఫర్మాటిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న వారికి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్‌ఈ)లో 6 సీట్లు కేటాయిస్తామని ఐఐటీ కాన్పుర్ పేర్కొంది. కెమిస్ట్రీ, ఎకనామిక్స్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, బయలాజికల్ సైన్సెస్ & బయో ఇంజినీరింగ్ విభాగాల్లోనూ సీట్లు కేటాయిస్తామని తెలిపింది. ఈ సీట్లకు మార్చి మొదటి వారంలో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది. 'జోసా' కౌన్సెలింగ్ కంటే ముందుగానే ఈ ప్రవేశాలను పూర్తిచేయనున్నారు. అయితే నేరుగా కల్పించే ప్రవేశాల్లో.. ఇప్పటికే ఉన్న సీట్ల నుంచే ఒలింపియాడ్ విద్యార్థులకు కేటాయిస్తారా? లేదా సూపర్ న్యూమరరీ కింద అదనపు సీట్లు మంజూరు చేస్తారా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.