National Education Policy Language Rule:    పాఠశాల విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించే దిశగా సుప్రీంకోర్టు గురువారం ఒక కీలకమైన పరిశీలన చేసింది. సీబీఎస్ఈ కరికులంలో భాగంగా 9వ తరగతిలో కొత్తగా మూడో భాషను  ప్రవేశపెట్టడం సరికాదని, ఇది బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై అనవసరమైన మానసిక ఒత్తిడిని పెంచుతుందని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. తమిళనాడులో ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలను  ఏర్పాటు చేయాలన్న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.

Continues below advertisement

జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. తమిళనాడు ప్రభుత్వం నవోదయ విద్యాలయాల ఏర్పాటును వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఈ పాఠశాలల్లో అనుసరిస్తున్న త్రిభాషా సూత్రమేనని  రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, దీనిపై స్పందించిన జస్టిస్ నాగరత్న.. త్రిభాషా సూత్రంలో ఎక్కడా హిందీని ఖచ్చితంగా నేర్చుకోవాలని నిర్బంధించలేదని స్పష్టం చేశారు. మాతృభాష, ఇంగ్లీష్‌తో పాటు ఏదైనా ఒక మూడో భాషను ఎంచుకోవచ్చని, అది సంస్కృతం అయినా ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు.

ఈ క్రమంలో మూడో భాషను 9వ తరగతిలో నిర్బంధంగా మారుస్తున్నారని రాష్ట్ర కౌన్సిల్ తెలపగా.. జస్టిస్ నాగరత్న తీవ్రంగా స్పందించారు. 9వ తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం చాలా తప్పుడు నిర్ణయం. ఎందుకంటే 10వ తరగతి బోర్డు పరీక్షల  కారణంగా విద్యార్థులకు 8వ తరగతి చివరి నుంచే ఒత్తిడి మొదలవుతుంది. కాబట్టి కొత్త భాషను నేర్పించాలనుకుంటే 6వ తరగతి నుంచే ప్రారంభించాలి.. ఎంత త్వరగా నేర్పిస్తే అంత మంచిది  అని కేంద్ర ప్రభుత్వానికి, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ , స్టేట్ బోర్డులకు ఆమె హితవు పలికారు.  

Continues below advertisement

ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న 1970ల నాటి తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎస్ఎస్ఎల్‌సీ   బోర్డు పరీక్షల కోసం 6వ తరగతి   నుంచే మూడో భాషను నేర్చుకోవడం ప్రారంభించామని తెలిపారు. అప్పట్లోనే బోర్డు పరీక్షల కోసం అంతటి సన్నద్ధత ఉంటే, ప్రస్తుత తరం విద్యార్థులపై ఇంకెంత ఒత్తిడి ఉంటుందో అర్థం చేసుకోవాలని, అందువల్ల 9వ తరగతిలో కొత్త భాష భారంగా మారకూడదని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో, కేంద్ర ప్రభుత్వ పథకాలు లేదా పాఠశాలలు అనే ఒకే ఒక్క కారణంతో వాటిని పూర్తిగా తిరస్కరించవద్దని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. మీ సొంత విద్యా విధానాన్ని మీరు కలిగి ఉండటంలో తప్పులేదు కానీ, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు రాకుండా అడ్డుకోవద్దని పేర్కొంది. ప్రస్తుతం జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుపై కేంద్రం , తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, భూమి గుర్తింపునకు సంబంధించి మరికొంత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.