CM Vijay Warning to Ministers Corruption: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం  అధినేత విజయ్ తన మార్క్ పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టారు. చెన్నైలో  నిర్వహించిన రెండవ కేబినెట్ సమావేశంలో ఆయన మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు తావులేదని స్పష్టం చేస్తూ.. ఒకవేళ ఏ మంత్రికైనా అవినీతి మరక అంటినా, ఆరోపణలు రుజువైనా సరే క్షణాల్లో వారి మంత్రి పదవిని రద్దు చేయడానికి వెనుకాడబోనని సీఎం విజయ్ అత్యంత కఠినంగా హెచ్చరించారు.

Continues below advertisement

అవినీతికి పాల్పడితే పదవి ఊస్టింగే 

ఈ కేబినెట్ భేటీలో సీఎం విజయ్ మంత్రులకు క్రమశిక్షణ, నిబద్ధతపై కీలక దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు తమకు తెలిసిన వారైనా, తెలియని వారైనా సరే తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు. ప్రజాధనాన్ని కాపాడటం, పారదర్శకమైన సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని మంత్రులకు గట్టిగా గుర్తుచేశారు. సీఎం విజయ్ చేసిన ఈ హెచ్చరికలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

Continues below advertisement

పబ్లిసిటీ కోసం తనిఖీలు బంద్ 

కేబినెట్ సమావేశంలో సీఎం విజయ్ మరో వినూత్నమైన ,  కీలకమైన ఆదేశాన్ని జారీ చేశారు. తనిఖీల పేరుతో  మంత్రులు ఎవరూ ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు వెళ్లకూడదని ఆయన స్పష్టం చేశారు. మంత్రుల హడావుడి పర్యటనల వల్ల క్షేత్రస్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడతారని, అది పరిపాలనా అంతరాయానికి దారితీస్తుందని విజయ్ అభిప్రాయపడ్డారు. తనిఖీల బాధ్యతలను అధికారులకే వదిలేసి, మంత్రులు పాలనాపరమైన విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి సంచలన విజయం సాధించిన విజయ్, తన రెండవ కేబినెట్ సమావేశంలోనే ఇంతటి దూకుడు ప్రదర్శించానికి కారణం.. వరుసగా వస్తున్న ఆరోపణలే.  గత ప్రభుత్వాల హయాంలో విమర్శలు ఎదుర్కొన్న శాఖలపై ప్రత్యేక నిఘా ఉంచామని, ప్రజల నుంచి వచ్చే అవినీతి ఫిర్యాదులపై సిఎంఓ  నేరుగా స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు. మంత్రులందరూ తమ తమ శాఖల పనితీరును మెరుగుపరుచుకోవాలే తప్ప, ఆడంబరాలకు తావివ్వకూడదని హితవు పలికారు.  

ప్రజల్లో క్లీన్ ఇమేజ్‌కు ప్రయత్నం 

 తమిళనాడులో సరికొత్త రాజకీయ శకానికి తెరతీసిన విజయ్.. ఈ కఠిన నిర్ణయాల ద్వారా తాను మిగిలిన రాజకీయ నాయకుల కంటే భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నానని నిరూపించారు. కేబినెట్ వేదికగా ఆయన మంత్రులకు విధించిన ఈ గడువులు, క్రమశిక్షణా నియమాలు తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ ఇమేజ్‌ను ప్రజల్లో అమాంతం పెంచేలా ఉన్నాయి. అవినీతి రహిత తమిళనాడు నిర్మాణమే ధ్యేయంగా సీఎం విజయ్ నడుపుతున్న ఈ పారదర్శక పాలన భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.