Minister Narayana Local Body Elections Statement:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ సమరానికి వేదిక సిద్ధమవుతోంది. రాష్ట్రంలో   స్థానిక సంస్థల  ఎన్నికల నిర్వహణప చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలోనే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. పట్టణ ప్రాంత ఓటర్లపై పట్టు సాధించడమే లక్ష్యంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎన్నికల సన్నాహక విధులను వేగవంతం చేశారు.

Continues below advertisement

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పదవీ కాలం ముగిసి, ప్రస్తుతం అవి ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా పాలకమండళ్లను తీసుకురావడానికి ప్రభుత్వం మూడు అంచెల వ్యూహాన్ని అమలు చేయబోతోంది.  తొలుత సెప్టెంబర్ నెలలో నగరపాలక  ఎన్నికలను పూర్తి చేస్తారు. ఆ వెంటనే అక్టోబర్‌లో ఎంపీటీసీ , జడ్పీటీసీ  ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చివరి విడతలో గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ఒక పక్కా షెడ్యూల్ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది.

ఈ లోకల్ బాడీ పోరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం   సైతం తన వైపు నుంచి ముందస్తు చర్యలను ప్రారంభించింది. ఎన్నికల నిర్వహణకు అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా సవరణ, వార్డుల పునర్విభజన  ప్రక్రియను పురపాలక సంఘాల్లో ఇప్పటికే ప్రారంభించారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లందరికీ స్థానిక సంస్థల్లో ఓటు హక్కు కల్పించేలా కొత్త నిబంధనలను పరిశీలిస్తున్నారు. మరోవైపు, వెనుకబడిన తరగతుల  రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక అందిన వెంటనే ఏపీఎస్ఈసీ ఎన్నికల తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

Continues below advertisement

ఎన్నికల సంకేతాలు వెలువడటంతో అధికార తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. జూలై 27వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 45 రోజుల పాటు భారీ ఎత్తున  డోర్ టూ డోర్ కార్యక్రమాన్ని చేపట్టాలని పార్టీ అధిష్టానం శ్రేణులను ఆదేశించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే తీసుకున్న ప్రజాకర్షక నిర్ణయాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి క్యాడర్‌ను పూర్తి స్థాయిలో సమరసన్నద్ధం చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.               

మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఆశించే అభ్యర్థుల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను కూడా త్వరగా ముగించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఫలితాలు ప్రభుత్వంపై ప్రజాభిప్రాయానికి అద్దం పడతాయని, అందువల్ల జనసేన, బీజేపీలతో కలిసి కూటమిగా ఉమ్మడి వ్యూహాలతో బరిలోకి దిగుతామని నేతలు చెబుతున్నారు. మొత్తానికి సెప్టెంబర్ మున్సిపల్ పోరు ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేపబోతోంది.