AP Industry Rebuilding Trust Lokesh: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో చిత్తూరు జిల్లాకు చెందిన అమరరాజా గ్రూప్ ఒక తిరుగులేని విజయగాథ. ప్రపంచ స్థాయి బ్యాటరీ తయారీ సంస్థగా ఎదిగి, వేలాది మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద రూ. 9,500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న గిగా కారిడార్‌లో భాగంగా కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ను విజయవంతంగా ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రారంభించగా, అమరరాజా అధినేత గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ భిన్నంగా స్పందించారు.
నాలుగు దశాబ్దాలకు పైగా, ఆంధ్రప్రదేశ్ సాధించిన అత్యంత గొప్ప పారిశ్రామిక విజయగాథలలో అమరరాజా కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు, అంతకంటే ఎంతో ఎక్కువ. ఇది ప్రపంచ స్థాయి తయారీ రంగాన్ని సృష్టించింది, వేలాది మందికి ఉద్యోగాలను కల్పించింది, మరియు చిత్తూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ పేరును భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా చాటిచెప్పిందని గుర్తుచేసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో మీ సంస్థ ఎదుర్కొన్న వేధింపులు అసలు జరిగకుండా ఉండాల్సింది. తన సొంత రాష్ట్రంలో పరిశ్రమను నిర్మించాలని ఎంచుకున్న ఒక పారిశ్రామికవేత్తకు ప్రోత్సాహం లభించాలి కానీ, బెదిరింపులు కాదు. ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన ఒక సంస్థ తన తదుపరి వృద్ధి ప్రస్థానం కోసం మన సరిహద్దులు దాటి వేరే రాష్ట్రం వైపు చూడాల్సి రావడం నన్ను ఎంతగానో కలచివేస్తోందన్నారు. మనం మళ్లీ నమ్మకాన్ని పునరుద్ధరిస్తున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులకు సిద్ధంగా ఉంది. అమరరాజా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో, అదే రాష్ట్రంలో దాని అత్యంత అద్భుతమైన కొత్త అధ్యాయాలు సృష్టిస్తాయని నమ్ముతున్నట్లుగా తెలిపారు. మా తలుపులు, మా హృదయాలు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయని ఆహ్వానించారు.
అమరరాజా సంస్థకు ఈ స్థాయి ఎదుగుదలను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గడ్డను దాటి పొరుగు రాష్ట్రంలో ఇంత భారీ పెట్టుబడి పెట్టాల్సి రావడం వెనుక గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలే ప్రధాన కారణం. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో, అప్పటి గుంటూరు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ను . ఆయన కుటుంబ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వేధింపులకు గురిచేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో చిత్తూరులోని అమరరాజా ప్లాంట్లకు మూసివేత నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి ఒత్తిళ్లతో పరిశ్రమను ఊపిరి ఆడకుండా చేశారు.
సొంత రాష్ట్రంలో వ్యాపారాన్ని రాజకీయ కారణాలతో దెబ్బతీసే ప్రయత్నం చేయడం, తీవ్రమైన బెదిరింపులు, వేధింపులు ఎదురుకావడంతో అమరరాజా యాజమాన్యం తీవ్ర అభద్రతాభావానికి లోనైంది. భవిష్యత్ విస్తరణ ప్రాజెక్టులను ఏపీలో పెడితే మరింత నష్టం వాటిల్లుతుందని భావించి, అప్పట్లో పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్న తెలంగాణ వైపు వారు మొగ్గు చూపారు. నాటి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో రూ. 9,500 కోట్ల విలువైన దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ ప్రాజెక్టును మహబూబ్‌నగర్‌కు తరలించారు. ఏపీలో రావలసిన ఈ భారీ పెట్టుబడి, తద్వారా లభించాల్సిన వేలాది ఉద్యోగాలు జగన్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్లే పొరుగు రాష్ట్రానికి తరలిపోయాయని నాడు విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. పారిశ్రామిక ప్రగతికి రాజకీయాలు ఎలా శాపంగా మారుతాయో చెప్పడానికి అమరరాజా ఉదంతం ఒక పాఠం లాంటిది. ఒక నాయకుడి వ్యక్తిగత అహానికి, కక్షసాధింపు చర్యలకు వ్యవస్థలు బలైతే రాష్ట్రాలు ఎంతటి ఆర్థిక నష్టాన్ని చవిచూస్తాయో ఈ తరలిపోయిన ప్రాజెక్ట్ స్పష్టం చేస్తోంది. ఏదేమైనా, తెలంగాణలో ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా గల్లా జయదేవ్ చేసిన ట్వీట్.. ఏపీలో గత పాలకుల వైఫల్యాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పారిశ్రామిక పునరుద్ధరణ ప్రయత్నాలను జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు పెట్టేలా చేసింది.
