అమరావతి: భారత సైన్యంలో అగ్నివీర్, రెగ్యులర్ విభాగాల నియామకాల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CEE) ఫలితాలు రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని గుంటూరు ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను సైన్యం అధికారిక వెబ్‌సైట్ www.joinindianarmy.nic.in లో చూసుకోవచ్చని వారికి సూచించారు. ఈ పరీక్షలో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు రిక్రూట్‌మెంట్ తరువాత దశల్లో భాగంగా జరిగే శారీరక, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియల కోసం తమ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.

Continues below advertisement

వివిధ విభాగాలకు ఎంపికైన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు నిర్వహించనున్నారని తెలిపారు. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సిపాయి ఫార్మా, హవల్దార్ ఎడ్యుకేషన్ విభాగాలకు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి పుదుచ్చేరిలో జరిగే ర్యాలీకి హాజరు కావాలని తెలిపారు. అలాగే, అగ్నివీర్ క్లర్క్/ఎస్‌కేటీ, ఉమెన్ మిలిటరీ పోలీస్ అభ్యర్థులకు సెప్టెంబరు 28 నుంచి తమిళనాడులోని కృష్ణగిరిలో ర్యాలీ నిర్వహిస్తారు. ఇక అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ (10వ/ 8వ తరగతి) విభాగాల అభ్యర్థులకు సెప్టెంబరు 3 నుంచి విశాఖపట్నంలో, వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఒంగోలులో రిక్రూట్‌మెంట్ ర్యాలీలు జరుగుతాయని కల్నల్ రజత్ సువర్ణ వెల్లడించారు. 

భారత త్రివిధ దళాలలో (ఆర్మీ, నేవీ, వాయుసేన) యువతకు సైనిక సేవలందించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన అతిముఖ్యమైన స్కీమ్ అగ్నిపథ్. ఈ పథకం ద్వారా త్రివిధ దళాలలో సేవ చేసేందుకు ఎంపికైన సైనికులను అగ్నివీర్ అంటారు. మన దేశంలో ఎంతో మంది యువత అగ్నివీర్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు.

Continues below advertisement

Also Read: AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి

అగ్నివీరులుగా మొత్తం నాలుగు సంవత్సరాల కాలానికి మాత్రమే డ్యూటీ పరిమితం అయి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 17.5 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలని సూచించారు. అయితే నోటిఫికేషన్లో పేర్కొన్న విషయాల పరంగా ఏజ్ లిమిట్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగా ముందుగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), ఆ తర్వాత శారీరక దారుఢ్య పరీక్షలు (Physical Tests) నిర్వహించనున్నారు. దాంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకున్న తర్వాత అగ్నివీర్‌లకు సేవా నిధి పేరుతో ఆర్థిక సహాయం లభిస్తుంది. దాంతో పాటు ప్రభుత్వ రంగంలో, ఇతర ఉద్యోగాల్లో ఇతరులతో పోల్చితే తగిన ప్రాధాన్యత లభిస్తుందని కేంద్రం పేర్కొంది.