NEET-UG Exam: నీట్‌-యూజీ పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన తీర్పు వెలువరిచింది. మళ్లి నీట్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్న మాట వాస్తవమేనని.. అయితే దీనివల్ల కేవలం 155 మంది అభ్యర్థులు మాత్రమే లబ్ధి పొందారని కోర్టు తెలిపింది. ఈ కారణంగా మిగతా అభ్యర్థులందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన అసవరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం జులై 23న తీర్పు చెప్పింది. నీట్‌ పేపర్‌ లీకేజీ ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులు లబ్ధి పొందారని, ఆ లబ్ధిపొందిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు.


మాథ్యూస్‌ నెడుంపరపై సీజీఐ ఆగ్రహం.. 
నీట్‌ పేపర్‌ లీకేజీపై జులై 23న సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (సీజేఐ డీవై చంద్రచూడ్‌) నేతృత్వంలో జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించింది. అయితే నీట్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్.. నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ.. దాఖలైన ఓ పిటిషనర్‌ తరుపు సీనియర్‌ న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోర్టు నుంచి బయటకు వెళ్లిపోవాలి. లేదంటే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఇలా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహానికి న్యాయవాది మాథ్యూస్‌ నెడుంపర వ్యవహారశైలే కారణం.