AP SSC Exam Paper Leak : ఆంధ్రప్రదేశ్ లో పదో పరీక్షా పత్రాల లీకేజీ సంచలనమవుతోంది. నిన్న నంద్యాల జిల్లాలో తెలుగు పేపర్ లీక్ అయింది. గురువారం శ్రీకాకుళం జిల్లాలో హిందీ పేపర్ లీకేజీ అయిందని వార్తలు వస్తున్నాయి. సరుబుజ్జిలి మండలంలోని రొట్ట వలస, సలంత్రీ పరీక్షా కేంద్రాల నుంచి హిందీ పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియా బాగా ప్రచారం జరిగింది. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే పరీక్ష పత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయినట్లు తెలుస్తోంది. దీంతో సమాచారం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి పగడాలమ్మ రొట్టవలస పరీక్షా కేంద్రానికి వచ్చి అధికారులను ఆరా తీశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేంద్రాల నుంచి పరీక్ష పత్రం లీక్ కాలేదని, ఎక్కడో ఏదో జరిగిందని అనుమానిస్తున్నారు. పదో తరగతి హిందీ పేపర్ లీక్ వదంతులపై కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ విచారణకు ఆదేశించారు. పదోతరగతి ప్రశ్నపత్రం లీక్‌ కాలేదని డీఈవో అన్నారు. వదంతులు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


 తెలుగు పేపర్ లీక్


నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 10వ తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు సీఆర్పీలు, పది మంది టీచర్లను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన నలుగురు ఉద్యోగులపై విద్యాశాఖ సస్పెండ్ చేసింది. 


అసలేం జరిగిందంటే? 


నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం లీకేజీపై డీఈఓ నివేదికతో ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్ కు పాల్పడిన ప్రధాన వ్యక్తి రాజేష్ ను అరెస్ట్ చేశామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్ తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారుల విచారణ మేరకు పరీక్ష ప్రారంభమైన తర్వాత సీఆర్‌పీ రాజేష్ తన మొబైల్‌తో ఫోటో తీసి సమాధానాల కోసం బయట వేచివున్న 9 మంది తెలుగు టీచర్లకు పోస్ట్ చేశారని ఆయన స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీస్ చేసిన రాజేష్ తో పాటు 9 మంది టీచర్లు కూడా అరెస్ట్ చేశామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 


విద్యాశాఖ సీరియస్ 


తెలుగు పండితులైన నీలకంటేశ్వర రెడ్డి, నాగరాజు, మధు, వెంకటేశ్వర్లు, దస్తగిరి, వనజాక్షి, లక్ష్మీ దుర్గ, ఆర్యభట్టు, పోతునూరు, రంగనాయకులు కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగిందని, వీరితో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకోవాల్సి ఉందని జిల్లా కలెక్టర్ చెప్పారు. పరీక్ష కేంద్రంలో ఇలాంటి సంఘటన జరుగుతున్న బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన చీఫ్ సూపర్నెంట్, ఇన్విజిలేటర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఫ్లయింగ్ స్క్వాడ్ నలుగురిని సస్పెండ్ చేశామన్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ వివరించారు. పదో తరగతి పేపర్ లీకేజీలతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు నిషేధిస్తూ తాజా ఆదేశాలు జారీ చేసింది. అయినా గురువారం హిందీ పేపర్ బయటకు రావడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.