LLB Admissions: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల న్యాయ కళాశాలలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ (5 సంవత్సరాలు) కోర్సులో మొదటి సంవత్సరం ప్రవేశాలకు జనవరి 4న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డా.మల్లయ్య బట్టు ఒక ప్రకటించారు. కొత్తగా హనుమకొండలో ఏర్పాటుచేసిన బాలికల గురుకుల లా కాలేజీ, కందుకూరులో బాలుర కోసం ఏర్పాటు చేసిన లా కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలు కల్పించనున్నారు. వీటిలో చేరేందుకు లాసెట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన కోరారు. విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు, మూడు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు తీసుకుని కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని డా.మల్లయ్య బట్టు సూచించారు.
స్పాట్ అడ్మిషన్లకు తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు..
➥ లాసెట్ హాల్‌టికెట్
➥ ర్యాంక్ కార్డు
➥ 10వ తరగతి, ఇంటర్మీడియట్ మెమోలు, టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
➥ TS LAWCET-2023 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్
➥ SSC లేదా తత్సమాన మార్కుల మెమో
➥ ఇంటర్మీడియట్ లేదా సమానమైన పాస్ సర్టిఫికేట్ మరియు మార్క్ షీట్
➥ బదిలీ సర్టిఫికేట్ (టీసీ)
➥ అన్ని విద్యార్హత స్టడీ సర్టిఫికేట్లు.
➥ నివాస ధృవీకరణ పత్రం
➥ ఆదాయ ధృవీకరణ పత్రం,
➥ రేషన్ కార్డ్
➥ ఆధార్ కార్డ్
➥ కుల ధృవీకరణ పత్రం
టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశ పరీక్ష మే 25న మూడు సెషన్లలో నిర్వహించిన సంగతి తెలిసిందే. మొదటి సెషన్‌ను ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు, రెండో సెషన్‌ను మధ్యాహ్నం 12:30 నుంచి 2 గంటల వరకు నిర్వహించారు. ఐదేండ్ల లా డిగ్రీ కోర్సు విద్యార్థులకు మూడో సెషన్‌లో సాయంత్రం 4 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించారు. ఈ ఏడాది లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలకు దాదాపు 30 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాల అనంతరం కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. పరీక్షల ఆన్సర్ కీని మే 29న ఆన్సర్ కీని విడుదల చేశారు. ఆన్సర్ కీపై మే 31 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మొదటి, రెండో సెషన్లకు తెలంగాణలో 60, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడో సెషన్‌కు తెలంగాణలో 41, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మూడేండ్ల లా డిగ్రీ కోర్సుకు 31,485 మంది, ఐదేండ్ల లా డిగ్రీ కోర్సులకు 8,858 మంది, ఎల్ఎల్ఎంకు 3,349 మంది దరఖాస్తు చేసుకున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌కు 43,692 మంది హాజరయ్యారు కానున్నారు. పరీక్షకు హాజరైనవారిలో లాసెట్ (మూడేళ్ల ఎల్ఎల్‌బీ)లో 78.59 శాతం, లాసెట్ (ఐదేండ్ల ఎల్ఎల్‌బీ)లో 80.21 శాతం, పీజీ ఎల్‌సెట్(ఎల్ఎల్ఎం) లో 94.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి రెండు విడతల కౌన్సెలింగ్ అనంతరం, మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ ప్రవేశాలకు అవకాశం కల్పించారు.
సీట్ల వివరాలు ఇలా..
➥ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 20,234 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 22 కళాశాలల్లో మొత్తం 4,790 సీట్లు ఉన్నాయి.
➥ అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు పరీక్షలో మొత్తం 6,039 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 19 కళాశాలల్లో మొత్తం 2,280 సీట్లు ఉన్నాయి.
➥ ఇక రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం పరీక్షలో మొత్తం 2,776 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. రాష్ట్రంలోని 17 కళాశాలల్లో మొత్తం 930 సీట్లు ఉన్నాయి.