తెలంగాణలో ఇక ఇంటర్ పూర్తయిన విద్యార్థులు కూడా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే వెసులుబాటు రాబోతుంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం 20 వేల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రభుత్వానికి, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మధ్య అవగాహన కుదిరిందని ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు ఇన్‌ఛార్జి కార్యదర్శి నవీన్‌మిత్తల్‌తో డిసెంబరు 29న మంత్రి సబిత తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.


మ్యాథమెటిక్స్ తప్పనిసరి.. 
సాఫ్ట్‌వేర్ కొలువులకు ఎంపిక కావాలంటే ఇంటర్మీడియట్‌లో ఒక సబ్జెక్టుగా గణితం చదవడం తప్పనిసరి. అంటే ఎంపీసీ, ఎంఈసీ గ్రూపుల విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండనుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి నెలలో ఆన్‌లైన్ పరీక్షను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షను హెచ్‌సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్టు (క్యాట్)గా పిలుస్తారు. గణితం, లాజికల్ రీజనింగ్, ఆంగ్లానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో 60 శాతం మార్కులు సాధించిన వారికి ఆన్‌లైన్ ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేస్తారు. 




6 నెలల శిక్షణ..
ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయినవారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్యాలయంలో ఆరు నెలలపాటు ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పిస్తారు. ఈ సమయంలో వారికి  నెలకు రూ.10 వేలు స్టైఫండ్‌గా ఇస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి కాగానే రూ.2.5 లక్షల వార్షిక వేతనంపై పూర్తిస్థాయిలో అవకాశం కల్పిస్తారు. వీరికి ఉద్యోగం చేస్తూనే బిట్స్, శాస్త్ర, అమిటి యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ పూర్తి చేసే వెసులబాటు కల్పిస్తారు. వీరి అనుభవం పెరుగుతున్న కొద్దీ ఏటేటా వేతనాన్ని పెంచుతారని మంత్రి సబిత వెల్లడించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పేద విద్యార్థులకు ఇదొక మంచి అవకాశమని మంత్రి తెలిపారు.


తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల, ముఖ్యతేదీలివే! 


ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు..
రాష్ట్రంలో మార్చి 15 నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేయాలనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నాడు తన కార్యాలయంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు ఉతీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నామినల్ రోల్స్ నుండి పరీక్షలు పూర్తి అవ్వడంతో పాటు ఫలితాలను వెల్లడించేనాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ బోర్డు ఇంచార్జి కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..