When Did Sunday Holiday Start: ఆదివారం అనగానే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ముఖాల్లోనూ ఒక తెలియని ఆనందం కనిపిస్తుంది. వారం రోజుల అలసట పోగొట్టుకుని, కుటుంబంతో గడపడానికి, ఇష్టమైన పనులు చేసుకోవడానికి కేటాయించిన ఈ రోజు వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఆదివారమే ఎందుకు సెలవు రోజుగా మారింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆదివారమే వీకాఫ్ ఉంటుందా? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటీ? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
ఆదివారం సెలవు దినంగా ప్రకటించడానికి చాలా చరిత్ర ఉంది. కాన్‌స్టాంటైన్ కాలం నుంచి ఆదివారం సెలవు రోజుగా వస్తూ ఉంది. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రైస్తవ మతంలో ఆదివారం అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఏసు పునరుత్థానం జరిగిన రోజుగా భావిస్తారు. రెండోది, నాటి రోమన్ సామ్రాజ్యంలో సూర్యారాధన ప్రభావం ఎక్కువగా ఉండేది. అందుకే సూర్యుడికి అంకితం చేసిన రోజుగా సన్‌డేను భావిస్తారు. విశ్రాంతికి అనువైనదిగా చెప్పుకుంటారు. అలా ఆదివారం సెలవు రోజుగా అధికారికంగా ప్రారంభమైంది.
దేవుడు ఆరు రోజులు పని చేయడానికి, ఏడో రోజు విశ్రాంతి కోసం దేవుడు నిర్ణయించాడని బైబిల్‌లో చెప్పినట్టు క్రైస్తవులు వివరిస్తుంటారు. మొదట్లో యూదులు సంప్రదాయం ప్రకారం ఈ విశ్రాంతి దినం శనివారం ఉండేది. క్రమంగా ఆ సెలవు దినాన్ని ఆదివారానికి మార్చేశారు. దీన్ని పవిత్రమైన దినంగా భావించి ఈ మార్పు చేసుకున్నారు. 365 ADలో జరిగిన కౌన్సిల్ ఆఫ్ లాడిసియా లో ఈ మార్పు జరిగింది. నాల్గో శతాబ్ధం నుంచి 17వ శతాబ్ధం వరకు దాదాపు మొత్తం క్రైస్తవ ప్రపంచం ఆదివారాన్ని లార్డ్స్ డేగా గుర్తించేవారు.
పారిశ్రామిక విప్లవం తర్వాత మరిన్ని మార్పులు
మతపరంగా మొదలైన ఆదివారం సెలవు రోజు 18వ శతాబ్ధంలో జరిగిన పారిశ్రామిక విప్లవం ఒక హక్కు మారింది. ఐరోపా, అమెరికాలోని పరిశ్రమల్లో కార్మికులు 12 నుంచి 18 గంటల పాటు శ్రమించేవాళ్లు. బాగా అలసిపోయే వాళ్లు. దీంతో అనారోగ్యానికి గురయ్యే వాళ్లు. అందుకే తమకు ఒక రోజు సెలవు దినం కావాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు చేపట్టారు.
ఇలా ఉద్యమాలు రావడంతో ఓవైపు మతపరమైన నిర్ణయాలతో ప్రార్థన చేసుకోవడానికి, శారీరక విశ్రాంతికి, కుటుంబంతో సమయం గడపడానికి ఆదివారం ఒక్కరోజున సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత 19-20 శతాబ్ధాల్లో హెన్రీ ఫోర్ట్ వంటి పారిశ్రామికవేత్తలు ఐదు రోజుల పని వారం విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇది క్రమంగా శని- ఆదివారాల వీకెండ్ కాన్సెప్ట్‌కు దారి తీసింది.
ప్రపంచవ్యాప్తంగా ఓ రోజు ఎక్కువ దేశాలు సెలవు దినంగా ప్రకటిస్తున్నాయి?
ప్రపంచంలోని సుమారు 70-80 శాతం దేశాల్లో ఆదివారమే ప్రధాన వీకాఫ్‌గా ఉంది. మొత్తం 195 దేశాల్లో సుమారు 160కిపైగా దేశాలు ఆదివారమే తమ వీకెండ్‌గా భాగంగా ఉంది. మరికొన్ని దేశాల్లో మాత్రం సెలవు రోజు భిన్నంగా ఉంది.
శుక్రవారం వీకాఫ్ కలిగిన దేశాలు
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం శుక్రవారం అత్యంత పవిత్రమైంది. సౌదీ అరేబియా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ వంటి దేశాల్లో శుక్రవారం సెలవు ఇస్తారు.
శుక్రవారం- శనివారం సెలవు దినం ఉన్న దేశాలు
గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బెహ్రెయిన్ వంటి చోట్ల ఈ విధానం కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం అంతర్జాతీయ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని వీకెండ్‌ను శని - ఆదివారానికి మార్చుకుంది. బ్రూనై లాంటి దేశాల్లో శుక్రవారం, ఆదివారాన్ని సెలవు దినాలుగా ఇస్తారు.
భారత్‌లో ఆదివారం సెలవు దినం ఎప్పటి నుంచి మొదలు?
భారత్‌లో ఆదివారం సెలవు విధానం బ్రిటీష్ పాలన కాలంలో ప్రవేశ పెట్టారు. బ్రిటీష్ వారు తమ దేశంలోని విధానాన్ని ఇక్కడ అమలు చేశారు. ప్రభుత్వ ఆఫీస్‌లు, కోర్టులు, విద్యాసంస్థల్లో ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు. స్వాతంత్ర్యం వచ్చిన కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని మార్చాలనే డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో బ్యాంకులు, ఐటీ రంగం, కార్పొరేట్ సంస్థల్లో శని- ఆదివారాలు సెలవుగా కొనసాగుతోంది. ఇతర రంగాల్లో ఆదివారం ప్రధాన సెలవు రోజుగా ఉంది.
ఇప్పుడు ఆదివారమే సెలవు ఎందుకు అవసరం?
ప్రపంచ దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు సాఫీగా జరగాలంటే అందరికి ఒకే పని క్యాలెండర్ ఉండటం అవసరం. ఇప్పుడు ఎక్కువ మంది భార్య భర్త, కుటుంబ సభ్యుల్లో చాలా మంది పని చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు అయితే కుటుంబ సభ్యులతో గడపడానికి వీలుగుతుంది.