Nara Lokesh addressed Telugu diaspora in Zurich:  అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు అని, ఆయన విజన్ సాధన కోసం తామంతా అహర్నిశలు కృషి చేస్తున్నామని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌లో నిర్వహించిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 20 దేశాల నుంచి తరలివచ్చిన తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ప్రవాసులకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Continues below advertisement

పెట్టుబడుల్లో ఏపీ నంబర్ వన్ - 23.50 లక్షల కోట్ల ఎంవోయూలు 

గత 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల స్వర్గధామంగా మారిందని లోకేష్ గర్వంగా ప్రకటించారు. ఈ స్వల్ప కాలంలోనే రూ. 23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా సుమారు 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటాతో ఏపీ ఇవాళ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉన్న అంతర్జాతీయ నమ్మకమే కారణమని ఆయన స్పష్టం చేశారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు.

Continues below advertisement

టీం-11 పై నిప్పులు - బ్రాండ్ సీబీఎన్' ప్రత్యేకత 

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్న  టీం-11 తీరుపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలను ఆయన ఇలా సెటైరిక్ గా చెప్పారు.  ఇన్వెస్టర్లు ఏపీకి రావద్దంటూ ఈ-మెయిల్స్ పంపే స్థాయికి వారు దిగజారారని విమర్శించారు.  టీం-11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అని ప్రశ్నించారు. కేవలం బాబాయ్ హత్య, తల్లి-చెల్లిని గెంటేయడం వంటి నెగటివ్ క్రెడిట్లే వారి ఖాతాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు, తమ కేబినెట్ లో యువ మంత్రులంతా మిస్సైల్స్ లాంటి వారని, తమకు చంద్రబాబు నాయుడు  జీపీఎస్  లాగా దిశానిర్దేశం చేస్తున్నారని కొనియాడారు.

అభివృద్ధి-సంక్షేమం జోడెద్దుల బండి 

ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా సాగుతున్నాయని లోకేష్ వివరించారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు, డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ వల్ల పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, పోలవరం పనులు, అమరావతి నిర్మాణం వంటివి పరుగులు పెడుతున్నాయని చెప్పారు. అభివృద్ధి కొనసాగాలంటే ప్రభుత్వ కొనసాగింపు అత్యవసరమని, కనీసం 15 ఏళ్ల పాటు ఇదే పాలన ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించినట్లుగానే తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

 వికేంద్రీకరణ - వినూత్న అభివృద్ధి నమూనా 

రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రధాన అజెండా అని లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి జిల్లాను ఒక ప్రత్యేక హబ్‌గా మారుస్తున్నామన్నారు. చిత్తూరు-కడపను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా, అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ప్రవాస తెలుగు వారంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని, తమ కంపెనీల విస్తరణకు ఏపీని ఎంచుకోవాలని కోరారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీఎన్ఆర్టీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.