Nitin Nabin was unanimously elected as the BJP president: భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన యువ నాయకుడు, ప్రస్తుతం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న  నితిన్ నబిన్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ఆయన ఒక్కరే బరిలో ఉండటంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. జేపీ నడ్డా వారసుడిగా నితిన్  మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ  కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

Continues below advertisement

అతి పిన్న వయసు అధ్యక్షుడిగా రికార్డు  భారతీయ జనతా పార్టీలో వారసత్వ మార్పిడి ప్రక్రియ ముగిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 45 ఏళ్ల నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆయన పేరును ప్రతిపాదించగా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు మద్దతు పలికారు. వేరే ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఎన్నిక ఖరారైంది. దీంతో బీజేపీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ రికార్డు సృష్టించారు.

బీహార్ నుంచి జాతీయ వేదికపైకి 

Continues below advertisement

బీహార్ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన నితిన్ నబీన్..  ఐదు  సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ .గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఆరెస్సెస్  నేపథ్యం ఉన్న నితిన్, పార్టీ అనుబంధ విభాగం బీజేవైఎం  లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి సంస్థాగత నిర్మాణంలో మంచి పట్టు సాధించారు. గత నెలలోనే ఆయనను జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించగా, ఇప్పుడు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేసినట్లయింది.

 మోదీ-షా మద్దతు.. యువతకు ప్రాధాన్యం 

ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియడంతో, ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై గత కొద్దిరోజులుగా ఉత్కంఠ నెలకొంది.  క్షేత్రస్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగిన నితిన్ నవీన్ వైపే ప్రధాని మోదీ, అమిత్ షా మొగ్గు చూపారు. రాబోయే  పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు,  2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఉత్సాహవంతుడైన యువ నేతకు పగ్గాలు అప్పగించడం ద్వారా పార్టీలో నూతనోత్తేజం నింపాలని హైకమాండ్  నిర్ణయించింది.  

మంగళవారం  ఉదయం ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ ప్రత్యేక అతిథిగా హాజరై నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలపనున్నారు. నితిన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే పార్టీలో కొత్త కార్యవర్గం ఏర్పాటు కానుంది. బీహార్ నుంచి ఒక నేత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడంతో అటు బీహార్‌తో పాటు జాతీయ స్థాయిలో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.