JoSAA Counseling 2025: జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) ద్వారా JEE Main, JEE Advanced 2025ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఇవాళ ప్రారంభమైంది. మొదటి అలాట్‌మెంట్ జాబితా ఇవాళ (జూన్ 14, 2025) ఉదయం 10:00 గంటలకు విడుదలైంది. ఈ జాబితాను josaa.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవాలంటే, విద్యార్థులు తమ JEE మెయిన్ లేదా JEE అడ్వాన్స్ అప్లికేషన్ నంబర్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి. ఈ జాబితాలో విద్యార్థులకు ఎక్కడ సీటు అలాట్ అయిందో, ఆ సీటును ఆమోదించడం ఎలా చేయాలో వివరాలు ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునేందుకు లక్షల మంది పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈ కాలేజీల్లో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ గడువు ముగిసింది. josaa.nic.in ద్వారా జూన్ 12న సాయంత్రం 5 గంటలకు వరకు రిజిస్ట్రేషన్ కోసం గడువు ఇచ్చారు.
JoSAA కౌన్సెలింగ్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు భారతదేశంలోని 127 ప్రముఖ సంస్థల్లో ప్రవేశం పొందేందుకు వీలు కలుగుతుంది. ఇందులో 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (IITs), 31 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (NITs), IIEST షిబ్‌పూ ర్, 26 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు (IIITs), 46 ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు (GFTIs) ఉన్నాయి. 62,853 BTech సీట్లలో IITల్లో 18,160 సీట్లు, NITల్లో 24,525 సీట్లు, IIITల్లో 9,940 సీట్లు, GFTIsలో 10,228 సీట్లు ఉన్నాయి.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ విండోలో ఇష్టమైన కోర్స్, సంస్థలను ఎంపిక చేసుకున్నారు. వాటి ఆధారంగా వచ్చిన ర్యాంకులు ఆధారంగా సీట్ల కేటాయింపు ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఒక్కో అభ్యర్థి ఎక్కువ ప్రాధాన్యతలు ఇచ్చారు. ఈ ప్రధాన్యాలు ఇవ్వని అభ్యర్థులకు సిస్టమ్ చివరిగా సేవ్ చేసిన ప్రాధాన్యతలను ఆటోమేటిక్‌గా లాక్ చేస్తుంది. లాక్ తర్వాత మార్పులు చేయాలంటే, కేవలం అభ్యర్థి అభ్యర్థనపై మాత్రమే సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్‌కు పంపిన OTP ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మార్పులు చేయడానికి వీలుకలుగుతుంది.
కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆరు రౌండ్లలో సీట్ కేటాయింపు జరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితాలు జూన్ 14న ఉదయం 10 గంటలకు ప్రకటించారు. IITలకు చివరి రౌండ్ ఫలితాలు జూలై 16న ప్రకటిస్తారు. మొత్తం ప్రక్రియ జులై 22న ముగుస్తుంది. సీట్ ఆమోదించిన తర్వాత ఐదో రౌండ్ సీట్ ఆమోద ప్రక్రియ ముగిసే లోపు ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకోవచ్చు.
రిజిస్ట్రేషన్ కాలంలో అభ్యర్థులకు రెండు మాక్ సీట్ అలోకేషన్లు కూడా ఇస్తారు. ఇవి అభ్యర్థులు తమ ప్రాధాన్యతల ఆధారంగా ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేయడానికి సహాయపడతాయి.
లాగిన్ కోసం, JEE Main 2025 అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ని యూజ్ చేసుకోవాలి. విదేశీయులు, OCI/PIO అభ్యర్థులు తమ JEE Advanced 2025 డైరెక్ట్ రిజిస్ట్రేషన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవ్వాలి.
JoSAA 2025 కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:
జూన్ 14: మొదటి రౌండ్ సీట్ కేటాయింపు (ఉదయం 10 గంటలకు)
జూన్ 21: రెండవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)
జూన్ 28: మూడవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)
జూలై 4: నాల్గవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)
జూలై 10: ఐదవ రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)
జూలై 16: IITలకు చివరి రౌండ్ ఫలితాలు (సాయంత్రం 5 గంటలకు)
మరిన్ని అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు JoSAA వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూసుకోవాలి.