Telangana Schools Reopen: తెలంగాణలోని పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 11తో ముగియడంతో.. నేటి నుంచి (జూన్ 12) పునఃప్రారంభం కానున్నాయి. ఇక దారులన్నీ స్కూళ్లవైపే మళ్లనున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు నేటి నుంచే తెరచుకోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల సుదీర్ఘ సెలవుల తర్వాత బడిబాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మతు పనులను దాదాపుగా పూర్తయ్యాయి. జూన్ 6న ప్రారంభమైన 'బడిబాట' కార్యక్రమం జూన్ 19 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ముఖ్యమంత్రి ఆ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముచ్చటిస్తారని ఆ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మొదటి రోజునే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, కొత్త యూనిఫాంల అందించనున్నారు. ప్రభుత్వం యూనిఫారాల తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించిన సంగతి తెలిసిందే. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 13న కొన్ని ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తారని తొలుత సమాచారం అందినప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వాయిదాపడిందని విద్యాశాఖ వర్గాల నుంచి సమాచారం. పాఠశాలలను సుందరంగా ముస్తాబుచేసి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సన్నాహాలు చేస్తున్నారు.
పాఠశాల విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో టాయిలెల్లు శుభ్రం చేయడానికి, ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శానిటరీ వర్కర్లను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితమే హామీ ఇచ్చారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఇదిలా ఉండగా.. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనేఫెస్టోలో పేర్కొంది. దానిపై కసరత్తు చేసిన అధికారులు కొత్తగా 203 చోట్ల బడులు అవసరమని విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపారు. అయితే వాటిని ప్రారంభించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు.
ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ విడుదల..
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం మే 25న విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త క్యాలెండర్ ప్రకారం జూన్ 12 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంకానుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఉన్నత పాఠశాలలు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు కొనసాగనున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 24న ముగియనున్నాయి.
తెలంగాణ స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..
ఏపీలో రేపటి నుంచి..
షెడ్యూల్ ప్రకారం జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉన్నాయి. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సెలవులను ఒకరోజు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 13 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పాఠశాలలు జూన్ 13న పాఠశాలలు తెరచుకోనున్నాయి.
కాగా ఏపీలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సెలవుల తర్వాత కొత విద్యాసంవత్సరం (2024-25)లో విద్యాసంవత్సరానికి గానూ జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. తాజా పరిణామంతో ఒకరోజు తర్వాత అంటే జూన్ 13న స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీలో పాఠశాలలకు విద్యాక్యాలెండర్ ప్రకటించాల్సి ఉంది.