Telangana Fee Reimbursement: తెలంగాణలో 2023-24 విద్యాసంవత్సరానికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల కోసం సంక్షేమశాఖలు దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. దరఖాస్తు గడువు డిసెంబరు 31తో ముగియనుంది. ఇప్పటివరకు కేవలం 4 లక్షల మంది విద్యార్థులు మాత్రమే వీటికోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల ప్రక్రియ ఆలస్యం కావడంతో దరఖాస్తు గడువు మరో మూడు నెలలు పొడిగించాలని ఎస్సీ సంక్షేమశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వ అనుమతి మేరకు దరఖాస్తు గడువు పొడిగించే అవకాశాలున్నట్లు సమాచారం.


రెండేళ్లుగా ఫీజుల్లేవ్..
రాష్ట్రంలో ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్స్ కోసం ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆ మరుసటి ఏడాదే ప్రభుత్వం బోధన ఫీజులు, ఉపకారవేతనాలు చెల్లిస్తూ వస్తోంది. కరోనా అనంతరం చెల్లింపులు ఆలస్యం కావడంతో బకాయిలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో లక్షల సంఖ్యలో విద్యార్థులు బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రెండేళ్లుగా సంక్షేమ విద్యార్థులకు ఫీజులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 


ఇప్పటికే కోర్సులు పూర్తిచేసిన, చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకారవేతనాలు, బోధన ఫీజులు కలిపి 2022-23 విద్యాసంవత్సరం నాటికే రూ.3250 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఫీజుల విడుదల్లో ఆలస్యం, సంక్షేమ శాఖలు విడుదల చేసిన బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు ఉన్నతవిద్య, ఉద్యోగావకాశాల కోసం అప్పులు చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లించి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి వస్తోంది.


త్వరలో సీఎం సమీక్ష..
బోధన ఫీజుల బకాయిలపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ఉపకారవేతనాలపై నివేదికలు సిద్ధం చేస్తున్నారు. 2022-23 విద్యాసంవత్సరానికి చెల్లించాల్సిన రూ.3250 కోట్లలో రూ.1250 కోట్లకు సంబంధించిన బిల్లులను సంక్షేమ శాఖలు ట్రెజరీలకు పంపించి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమశాఖల్లో నిధుల కొరత నెలకొంది. 2023-24 ఏడాదికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల డిమాండ్ దాదాపు రూ.2400 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మొత్తం కలిపితే వచ్చే మార్చి నాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.5650 కోట్లకు చేరుకోనున్నాయి.


ALSO READ:


ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి మరో అవకాశం, ఎప్పటివరకంటే?
తెలంగాణ(Telangana)లో ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు (TSBIE) పొడిగించింది. ఆలస్య రుసుము రూ.2,500తో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు జనవరి 3 వరకు ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో కొన్ని కోర్సుల్లో కలిపి 10.59 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. ఫీజు చెల్లింపు గడవు ముగిసేనాటికి 9.77 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇంకా 82 వేల మంది విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఈ క్రమంలో మరోసారి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది ఇంటర్ బోర్డు. 
ఫీజుల పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...