రాష్ట్రంలోని వివిధ పాలిటెక్నిక్‌లలో ఇంజనీరింగ్‌, నాన్‌-ఇంజనీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నిర్వహించబడే పాలిసెట్‌ 2023 దరఖాస్తుల ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్‌పర్సన్‌ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ కార్యాలయంలో గురువారం (ఫిబ్రవరి 17) జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వివరాలతో కూడిన కరపత్రం ఆవిష్కరణ, ఆన్‌‌లైన్‌‌లో నమూనా దరఖాస్తు నింపటం ద్వారా నూతన విద్యా సంవత్సర పాలిటెక్నిక్‌ ఆడ్మిషన్ల ప్రక్రియకు నాంది పలికారు. పాలీసెట్‌-2023 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్‌ 30 కాగా, పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా మే 10న నిర్వహించనున్నామని ఈ సందర్భంగా నాగరాణి పేర్కొన్నారు.


ఆసక్తి గల అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు అర్హత ప్రమాణాలు, సూచనలను జాగ్రత్తగా పరిశీలించాలని కమిషనర్‌ నొక్కిచెప్పారు. పరీక్ష ఆఫ్‌లైన్‌ మోడ్‌లో నిర్వహిస్తామని, పరీక్ష వ్యవధి 2 గంటలు కాగా, ప్రశ్నపత్రం మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటుందని చదలవాడ వివరించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రాన్రిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాలలో డిప్లొమా కోర్సులలో ప్రవేశం పొందగలుగుతారన్నారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయిన వెంటనే అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఆసక్తిగల విద్యార్ధులకు ఉచిత పాలీసెట్‌ కోచింగ్‌ అందించబడుతుందని కమిషనర్‌ తెలిపారు.


శుక్రవారం నుండి దీనికి సంబంధించిన మరింత సమాచారం, నవీకరణల కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https:/polycetap.nic.in ని సందర్శించవచ్చని నాగరాణి వివరించారు. మరిన్ని వివరాలకు సమీపంలోని ప్రభుత్వ పాలి-టె-క్నిక్‌లలోని సహాయ కేంద్రాన్ని వ్యక్తిగతంగా సంప్రదించవచ్చాన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యా శాఖ సంయిక్త సంచాలకులు పద్మారావు, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Online Application 


AP POLYCET 2023 INFORMATION BROCHURE


* ఏపీ పాలిసెట్ - 2023


అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పాలిసెట్‌ దరఖాస్తుకు అర్హులు.


దరఖాస్తు ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా .


ప్రవేశాలు కల్పించే సంస్థలు: పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిసెట్‌లో వచ్చిన స్కోర్‌ ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 


పరీక్ష విధానం: పాలిసెట్‌ పరీక్షను పెన్‌ అండ్‌ పేపర్‌(ఆఫ్‌లైన్‌) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్‌ ఛాయిస్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు విభాగాల నుంచి 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. మ్యాథ్స్‌–50, ఫిజిక్స్‌–40, కెమిస్ట్రీ–30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం రెండున్నర గంటలు. పదోతరగతి స్థాయి సిలబస్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్‌ మార్కింగ్‌ విధానంలో అమల్లో లేదు.


డిప్లొమా కోర్సులు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెటలర్జికల్, కెమికల్‌ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.02.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.04.2023.


➥ పాలిసెట్ పరీక్ష తేది: 10.05.2023 (ఉ.11:00 గం.-మ.1:00 గం.)


➥ ఫలితాల వెల్లడి: 25.05.2023.


పాలిసెట్ పాత ప్రశ్నపత్రాల కోసం క్లిక్ చేయండి.. 


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..