UGC NET PhD Qualifications: ఉన్నత విద్యలో మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చేందుకు యూనివర్సీటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పీహెచ్‌డీ ప్రదానానికి కనీస ప్రమాణాలను నిర్దేశిస్తూ యూజీసీ కొత్త నిబంధనలను ఇటీవల జారీచేసింది. దీనిప్రకారం విద్యార్థులకు పీజీ డిగ్రీతో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో చేరే అవకాశాన్ని కల్పించనుంది. యూజీసీ నెట్(జూన్) సెషన్ పరీక్షలో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనికోసం నాలుగేళ్లు లేదా 8 సెమిస్టర్లు ఉన్న డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అయితే, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ఉన్నా, లేకపోయినా పీహెచ్‌డీ అభ్యసించేందుకు నాలుగేళ్ల డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌‌లు ఉంటే చాలని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు మాస్టర్స్  డిగ్రీ పూర్తి చేసి 55 శాతం మార్కులు ఉన్న అభ్యర్థులను మాత్రమే నెట్‌కు అర్హులుగా పరిగణించేవారు.










తాజా నిర్ణయంతో ఇకపై నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగిన వారు నేరుగా యూజీసీ నెట్ (UGC NET) పరీక్ష రాసి పీహెచ్‌డీ చేసేందుకు అర్హులుగా నిర్ణయించినట్లు యూజీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ అభ్యర్థులు డిగ్రీలో సబ్జెక్టులతో సంబంధం లేకుండా తాము ఎంచుకున్న అంశాల్లో పీహెచ్‌డీ చేయవచ్చన్నారు. అయితే, ఇందుకోసం వారు నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75 శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుందన్నారు. యూజీసీ ఎప్పటికప్పుడు తీసుకొనే నిర్ణయం ప్రకారం ఇది మారుతూ ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల నాలుగేళ్ల డిగ్రీ పూర్తయినవారితో పాటు ప్రస్తుతం ఎనిమిదో సెమిస్టర్‌లో ఉన్న విద్యార్థులు సైతం యూజీసీ నెట్(జూన్ సెషన్‌)కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మరోవైపు, యూజీసీ నెట్ (జూన్) సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభమయ్యాయి.


పీహెచ్‌డీ కాలపరిమితి ఆరేళ్లు.. 
ఇకమీదట పీహెచ్‌డీ కాలపరిమితి కనీసం మూడేళ్లు, గరిష్ఠంగా ఆరేళ్లు ఉంటుంది. రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా గరిష్ఠంగా 2 ఏళ్ల అదనపు సమయం ఇస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీహెచ్‌డీ పూర్తికి 8 ఏళ్ల పరిమితి మించకూడదు. మహిళలు, దివ్యాంగుల (40శాతానికి మించి వైకల్యం ఉన్నవారు)కు మరో 2 ఏళ్ల పరిమితి ఇవ్వడానికి అవకాశం కల్పించారు. ఇలాంటివారు పీహెచ్‌డీలో చేరిన నాటి నుంచి పదేళ్లలో దాన్ని పూర్తిచేయడానికి వీలుంటుంది. మహిళా అభ్యర్థులు పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో 240 రోజులపాటు ప్రసూతి, శిశుపాలన సెలవులు తీసుకోవచ్చు.


యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్, గేట్, సీడ్ లాంటి జాతీయస్థాయి ప్రవేశపరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను పీహెచ్‌డీలో చేర్చుకోవచ్చు. లేదంటే ఉన్నత విద్యాసంస్థలు తాము సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి కూడా ప్రవేశాలు కల్పించవచ్చు. అయితే ఆ పరీక్ష 50 శాతం రీసెర్చ్‌ మెథడాలజీ, 50శాతం సంబంధిత సబ్జెక్టు ఆధారంగా ఉండాలి. ఈ ప్రవేశ పరీక్షల్లో 50శాతం మార్కులు సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూలకు పిలవొచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. అందుబాటులో ఉన్న పీహెచ్‌డీ సీట్ల సంఖ్యను బట్టి అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచే స్వేచ్ఛ ఉన్నత విద్యాసంస్థలకు ఉంటుంది. ఆ సంస్థలు నిర్వహించిన ప్రవేశపరీక్ష ద్వారా అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచి ఉంటే ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులకు 70శాతం, ఇంటర్వ్యూలో ప్రదర్శించే ప్రతిభకు 30శాతం వెయిటేజీ ఇవ్వాల్సి ఉంటుంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..