పారామెడికల్ కోర్స్‌తో అవకాశాల వెల్లువ..


తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పూర్తి చేసే కోర్స్‌ పారామెడికల్. సైన్స్‌పై ఆసక్తి ఉన్న వాళ్లు టెన్త్ అయిపోగానే ఈ కోర్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తరవాత వైద్య రంగంలో పూర్తిస్థాయిలో స్థిరపడిపోవచ్చు. ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్‌ నుంచి మొదలై...దాదాపు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ కోర్స్‌లు అందుబాటులో ఉన్నాయి. సైన్స్‌పై ఆసక్తి ఉన్న వాళ్లకు, మెడిసిన్‌కు ఆల్టర్‌నేట్‌ చూస్తున్న వాళ్లకు పారామెడికల్ కోర్స్‌ బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఇప్పటికే భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ పారామెడికల్ సిబ్బందికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వారికి డిమాండ్ కూడా బాగానే పెరుగుతోంది. అందుకే టెన్త్ తరవాత పారామెడికల్‌ కోర్స్ చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. పైగా కరోనా కారణంగా పారామెడికల్ సిబ్బంది రిక్రూట్‌మెంట్ పెరిగింది. 
 
డిప్లొమా కోర్స్‌లతో ఉపాధి..


ఈ కోర్స్‌లో చేరటానికి కనీస విద్యార్హత టెన్త్ క్లాస్. రూరల్‌ నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారామెడికల్ సిబ్బంది అవసరాలు పెరుగుతున్నందున నియామకాలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ పారా మెడికల్ కోర్సు పూర్తి చేసిన వాళ్లు నర్సింగ్, మెడిసిన్, ఫార్మసీ విభాగాల్లో పని చేసేందుకు అవకాశముంటుంది. హెల్త్ కేర్ సిస్టమ్‌లో వీళ్లకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఈ కోర్స్‌ పూర్తి చేసిన వారికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. టెన్త్ పూర్తైన విద్యార్థులు పారామెడికల్‌లో రెండు రకాల కోర్స్‌లను ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. పారామెడికల్ డిప్లొమా కోర్సెస్ ఒకటి కాగా, మరోటి పారామెడికల్ సర్టిఫికెట్ కోర్సెస్. పారామెడికల్ 
డిప్లొమా కోర్స్‌లు ఒకటి నుంచి రెండేళ్ల వ్యవధిలో పూర్తవుతాయి. డిప్లొమా ఇన్‌ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్, డిప్లొమా ఇన్‌ రూరల్‌ హెల్త్‌కేర్, జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ-GNM,ఆగ్జలరీ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ-ANM సహా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ, డిప్లొమా ఇన్ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ తదితర కోర్స్‌లు చేయవచ్చు. వీటితో పాటు డిప్లొమా ఇన్ ఆయుర్వేదిక్ నర్సింగ్, డిప్లొమా ఇన్ నర్సింగ్ కేర్, డిప్లొమా ఇన్‌ రూరల్ హెల్త్ కేర్‌ లాంటి కోర్స్‌లూ అందుబాటులో ఉన్నాయి. 


విదేశాల్లోనూ ఉద్యోగాలు..


ఇక సర్టిఫికెట్ కోర్సుల్లో ఎక్స్‌ రే రేడియాలజీ అసిస్టెంట్, మెడికల్ లాబరేటరీ అసిస్టెంట్, ఈసీజీ అసిస్టెంట్, డెంటల్ అసిస్టెంట్, సీటీ స్కాన్ టెక్నీషియన్, ఎమ్‌ఆర్‌ఐ టెక్నీషియన్ లాంటివి ఉంటాయి. ఈ కోర్సులు ఆరు నెలల నుంచి మొదలై రెండేళ్ల వరకూ ఉంటాయి. రూ. 5వేల నుంచి రూ.20 వేల ఎంపిక చేసుకున్న స్ట్రీమ్ ఆధారంగా ఈ వ్యవధి, ఫీజు ఉంటాయి. పారామెడికల్‌ నిపుణులకు భారతదేశంలోనే కాకుండా.. అమెరికా, యూఏఈ, బ్రిటన్, కెనడా తదితర దేశాల్లోనూ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ,ప్రైవేట్ రెండు రంగాల్లోనూ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. హాస్పిటల్స్, హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లు, క్లినిక్‌లు మంచి ప్యాకేజీలు ఇచ్చి మరీ విధుల్లోకి తీసుకుంటున్నాయి. సంస్థల ఆధారంగా రూ. 10వేల నుంచి రూ. 25 వేల వరకూ శాలరీ ఆఫర్ చేస్తున్నాయి. ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ ప్యాకేజీలూ పెరుగుతాయి. 


Also Read: Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే- భాజపా సంచలన నిర్ణయం


Also Read: Nothing Phone 1: నథింగ్ ఫోన్ 1 ధర లీక్ - యాపిల్‌కు పోటీనిచ్చే ధరే!