దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఫేజ్-1 ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను నవోదయ విద్యాలయ సమితి అక్టోబరు 10న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డును అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
విద్యార్థులు హాల్‌టికెట్లు ప్రింట్ తీసుకొని పరీక్ష రోజు వరకు భద్రపరచుకోవాలి. పరీక్షకు హాజరయ్యేవారు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతించరు. విద్యార్థులు హాల్‌టికెట్‌లోని నిబంధనలు క్షుణ్నంగా చదివి, పరీక్షరోజు పాటించాల్సి ఉంటుంది.
హాల్‌టికెట్‌లో అభ్యర్థులు తమ ఫొటో, సంతకం ఉన్నాయో లేదా పరిశీలించుకోవాలి. ఒకవేళ ఏమైనా సమస్యలుంటే అధికారులకు తెలియజేయాలి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 4న నవోదయ ప్రవేశపరీక్ష(ఫేజ్-1) నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం సెషన్‌లో 6వ తరగతి ప్రవేశపరీక్ష, మధ్యాహ్నం సెషన్‌లో 9వ తరగతిలో ప్రవేశాలకు పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మూడు సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాయొచ్చు పరీక్ష సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కులు లేవు.
➥ సెక్షన్-1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT) నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 50 మార్కులు ఉంటాయి. దీనికి ఒక గంట సమయం కేటాయించారు. ఈ సెక్షన్‌లో మొత్తం 10 విభాగాలుంటాయి. ఒక్కో దాంట్లో నాలుగేసి చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
➥ సెక్షన్-2లో అరిథ్‌మెటిక్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల్లో ఈ సెక్షన్ పూర్తిచేయాల్సి ఉంటుంది.
➥ సెక్షన్-3 అనేది లాంగ్వేజ్ టెస్ట్. ఇందులో 20 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. లాంగ్వేజ్ టెస్టులో పాసేజ్ ఇచ్చి, ప్రశ్నలకు సమాధానాలు రాయమంటారు. విద్యార్థులు పాసేజ్ అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకునేలా ఈ ప్రశ్నలు వస్తాయి. ప్రతి పాసేజ్ కింద అయిదేసి ప్రశ్నల చొప్పున నాలుగు పాసేజ్‌లు ఉంటాయి.
ALSO READ:
అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
యూజీసీనెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..