UGC NET 2024 June Exam Date: దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (జూన్)-2024 కోసం నిర్దేశించిన యూజీసీ నెట్ పరీక్ష (UGC NET 2024) పరీక్ష తేదీల్లో మార్పు జరిగింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 16న నిర్వహించాల్సిన పరీక్షను జూన్ 18కు రీషెడ్యూల్ చేసినట్లు యూజీసీ ఛైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ ఏప్రిల్ 29న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. జూన్ 16న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్ష ఉండటంతో.. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షను జూన్ 18 నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), యూజీసీ (UGC) నిర్ణయం తీసుకున్నట్లు యూజీసీ ఛైర్మన్ తెలిపారు. దీనికి సంబంధించి ఎన్టీఏ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 






మే 10 వరకు దరఖాస్తుకు అవకాశం..
యూజీసీ నెట్ జూన్ 2024 దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు మే 10 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మే 12 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ల డిగ్రీ ప్రోగ్రామ్‌లో 75 శాతం మార్కులు లేదా సమానమైన గ్రేడ్‌లను సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ (నాన్ క్రిమీ లేయర్), దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, ఇతర వర్గాలకు చెందిన వారికి 5శాతం మార్కులు/గ్రేడ్‌లలో సడలింపు ఉంటుంది.


యూజీసీ నెట్ జూన్- 2024 పరీక్ష విధానం..


➥ ఆన్‌లైన్ (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 2 పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లకు కలిపి మూడు గంటల సమయం ఉంటుంది.


➥ పేపర్-1కు గంట, పేపర్-2 కు రెండు గంటల సమయం ఉంటుంది. పేపర్-1 లో 100 మార్కులకుగాను 50 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్‌జెంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.


➥ పేపర్-2లో 200 మార్కులకుగాను 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అభ్యర్థుల ఆప్షనల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నలు అడుగుతారు.


తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, హయత్‌నగర్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వరంగల్. 


ఏపీలో పరీక్ష కేంద్రాలు: అమరావతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మంగళగిరి, నంద్యాల, నర్సరావుపేట, నెల్లూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.


Notification


Online Application


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..