NEET UG New Exam Date: భారత్‌లో వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే అతి పెద్ద ప్రవేశ పరీక్ష నీట్ యూజీ (NEET UG 2026) ప్రస్తుతం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు రావడంతో, అధికారులు పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సుమారు 22 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ఈ కుంభకోణం వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాలి? మళ్లీ పరీక్ష ఎప్పుడు ఉంటుంది? వంటి కీలక అంశాల గురించి తెలుసుకుందాం.
పరీక్ష రద్దుకు కారణం ఏంటీ?
మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ప్రధానంగా రాజస్థాన్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు అధికారులు ఒక చేతితో రాసిన గెస్ పేపర్ స్వాధీనం చేసుకున్నారు. ఆ పత్రంలో ఉన్న ప్రశ్నలను అసలు పరీక్షా పత్రంతో పోల్చి చూడగా ఏకంగా 120 ప్రశ్నలు మ్యాచ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో 90 బయాలజీ ప్రశ్నలు, 30 కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నట్టు సమాచారం. ఇంత భారీ స్థాయిోల ప్రశ్నలు ముందే బయటకు రావడంతో పరీక్ష పారదర్శకతపై నమ్మకం సన్నగిల్లింది. ఫలితంగా పరీక్ష రద్దుకు దారి తీసింది.
నిందితులు ఎవరు? దర్యాప్తు ఎక్కడ వరకు వచ్చింది?
ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక సూత్రధారులుగా భావిస్తున్న మనీష్ యాదవ్, రాకేష్ మాండవ్రియాలను రాజస్థాన్ ఎస్‌ఓజీ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ నెట్‌వర్క్ ఇంకా ఎంత మందికి విస్తరించిందనే కోణంలో విచారణ సాగుతోంది. అయితే ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈ వ్యవహారాన్ని సమగ్రంగా విచారించేందుకు సీబీఐకి బాధ్యతలు అప్పగించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా సీబీఐకి సహకారం అందిస్తామని అవసరమైన రికార్డులు, సాక్ష్యాలు అందజేస్తామని స్ఫష్టం చేసింది.
రీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది?
పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులంతా తదుపరి పరీక్ష తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నీట్ యూజీ 2026 రీ- ఎగ్జా్ జూన్ నెలలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 2024లో ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష రద్దు అయినప్పుడు జూన్ 23న రీ ఎగ్జామ్ నిర్వహించారు. కాబట్టి విద్యార్థులు జూన్ మాసంలో పరీక్షకు సిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి స్థాయి ఫలితాలు ఈ రీ ఎగ్జామ్ పూర్తి అయిన తర్వాతే విడుదలవుతాయి.
విద్యార్థులకు కీలక సమాచారం
పరీక్ష రద్దు, రీ ఎగ్జామ్‌ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను ఎన్టీఏ కొన్ని వివరణలు ఇచ్చింది.
రీ ఎగ్జామ్ కోసం విద్యార్థులు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మే 2026 పరీక్ష కోసం మీరు ఇచ్చిన వివరాలు, అభ్యర్థిత్వం, మీరు ఎంచుకున్న పరీక్షా కేంద్రాల సమాచారమే తదుపరి పరీక్షకు వర్తిస్తుంది. మళ్లీ ఫీజు కట్టాల్సిన పని లేదు. రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అనపు ఫీజు వసూలు చేయరు. అంతే కాకుండా గతంలో చల్లించిన ఫీజును రీ ఫండ్ చేస్తామని, ఎన్టీఏ తన అంతర్గత వనరులతోనే ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తారు.
పాత హాల్ టికెట్ చెల్లదు. రీ ఎగ్జామ్ కోసం ఎన్టీఏ కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డుల షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తారు. సోషల్ మీడియాలో వచ్చే అనధికార వార్తలను నమ్మొద్దని ఎన్టీఏ హెచ్చరించింది.
వైద్య విద్య అనేద దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఒక సీటు కోసం లక్షలాది మంది పోటీ పడుతున్నారు. 22 లక్షల మంది హాజరైన పరీక్షలో ఇలాంటి అక్రమాలు జరగడం విద్యార్థుల మానిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే విద్యార్థులు నిరాశ చెందకుండా, రీ ఎగ్జామ్ కోసం తన ప్రిపరేషన్ కొనసాగించడం మంచిది. పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్ కోసం విద్యార్థులు ఎన్టీఏ హెల్‌పైన్ నెంబర్‌లు 011-40759000/011-68227700కు కాల్ చేయవచ్చు లేదా neetug2026@nta.ac.inకు మెయిల్ చేయవచ్చు. అధికారి సమాచారం కోసం neet.nta.nic.in వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.
