Love Affair Murder: పదో తరగతి స్నేహితుల కలయిక  అంటే పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం. గుర్తుకొస్తున్నాయి అంటూ.. గుర్తుకొచ్చినన్ని కబుర్లు చెప్పుకోవడం.  కానీ, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన అలేఖ్య, వంశీ విషయంలో ఆ కలయిక ప్రాణాంతకమైంది. చిన్నప్పుడు చిగురించిన ప్రేమ, పెళ్లయ్యాక మళ్ళీ చిగురించడం.. ఒకరి నిండు ప్రాణాన్ని బలితీసుకోగా, మరో ముగ్గురిని జైలు పాలు చేసింది.

Continues below advertisement

 చిగురించిన పాత ప్రేమ 

అలేఖ్య, వంశీ పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ప్రేమించుకున్నారు. అయితే అది సఫలం కాలేదు.  బతుకు పోరాటంలో ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.  కాలక్రమేణా అలేఖ్యకు నవీన్ అనే వ్యక్తితో వివాహమైంది. వారు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.  ఇటీవల జరిగిన  టెన్త్ క్లాస్ గెట్-టుగెదర్  వేడుకలో అలేఖ్య, వంశీ మళ్ళీ కలుసుకున్నారు. పాత ప్రేమను గుర్తు  చేసుకున్నారు. సినిమాల్లోలా దాన్ని మధుర జ్ఞాపకంగా ఉంచుకుంటే సరిపోయేది. కానీ ఆ ప్రేమనుఇప్పుడు  వివాహేతర సంబంధంగా మార్చుకున్నారు. అలేఖ్య తరచూ వంశీతో ఫోన్లో మాట్లాడటం, రహస్యంగా కలుసుకోవడం భర్త నవీన్ గమనించాడు.

Continues below advertisement

 పథకం ప్రకారం హైదరాబాద్‌కు పిలిపించి.. 

తన భార్య పాత ప్రేమికుడితో తిరుగుతోందని తెలిసిన నవీన్, పగతో రగిలిపోయాడు. వంశీని వదిలించుకోవాలని నిర్ణయించుకుని, తన స్నేహితుడు భాస్కర్‌తో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. ఏప్రిల్ 30న వంశీని నమ్మించి హైదరాబాద్‌కు పిలిపించాడు. ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. వంశీ పూర్తిగా మత్తులో ఉండగా, నవీన్ తన స్నేహితుడి సాయంతో కత్తితో విచక్షణారహితంగా పొడిచి వంశీని హతమార్చాడు.

 లోయలో మృతదేహం పడేసిన నిందితులు                        

హత్య అనంతరం సాక్ష్యాలను మాయం చేసేందుకు  నిందితులు అత్యంత కిరాతకంగా వ్యవహరించారు. మృతదేహాన్ని ఒక ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, కారు డిక్కీలో పెట్టుకుని హైదరాబాద్ నుండి మంథని వరకు దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించారు. మంథని సమీపంలోని నిర్జన ప్రదేశమైన గాడుదుల గండి  లోయలో శవాన్ని పడేశారు. ఏమీ తెలియనట్లుగా అలేఖ్యతో కలిసి నవీన్ నాటకమాడాడు.

 సెల్ ఫోన్ సిగ్నల్స్ పట్టించాయి                                          

వంశీ కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు వంశీ చివరగా అలేఖ్య, నవీన్‌లతో ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషించగా అసలు నిజం బయటపడింది. పోలీసుల విచారణలో నవీన్ తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నవీన్, అలేఖ్య , వారికి సహకరించిన భాస్కర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. లోయలో పడేసిన వంశీ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఒకప్పటి స్నేహం, అక్రమ సంబంధంగా మారి ఇలా మూడు జీవితాలను నాశనం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.