నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫ‌ర్ పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ (నీట్ పీజీ) 2021 పరీక్ష ఈరోజు (సెప్టెంబర్ 11) జరగనుంది. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) వెల్లడించింది. నీట్ యూజీ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలలో ఎండీ, ఎంఎస్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులలో చేరవచ్చు. ఎయిమ్స్, పీజీఐఎంఈఆర్ (PGIMER), NIMHANS, SCTIMST, JIPMER తప్ప మిగతా అన్ని మెడికల్ కాలేజీలు, వర్సిటీలలో ప్రవేశాలు పొందవచ్చు. 


నీట్ పీజీ పరీక్షకు ఈ ఏడాది 1,74,886 మంది హాజరుకానున్నారు. కోవిడ్ కారణంగా ఈసారి పరీక్ష కేంద్రాల సంఖ్యను పెంచారు. నీట్ పీజీ అడ్మిట్ కార్డుతో పాటు.. ఎన్‌బీఈ పలు మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వీటిని తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. అడ్మిట్ కార్డులో ఇచ్చిన రిపోర్టింగ్ సమయం ప్రకారం రిపోర్టింగ్ చేయాలని అభ్యర్థులకు సూచించింది. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు రిపోర్టింగ్ కౌంటర్ మూసివేస్తారని పేర్కొంది. ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. 


నీట్ యూజీ పరీక్ష గైడ్ లైన్స్ ఇవే..



  • కోవిడ్ 19 మహమ్మారి కారణంగా, అభ్యర్థులంతా పరీక్షా కేంద్రంలో సామాజిక దూరాన్ని పాటించాల్సి ఉంటుంది.

  • ఫేస్ మాస్క్ లేకుండా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.

  • అభ్యర్థులు అడ్మిట్ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లడం తప్పనిసరి. హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.

  • రిజిస్ట్రేషన్ డెస్క్ వద్ద అందించిన శానిటైజర్‌ని ఉపయోగించి అభ్యర్థులు తమ చేతులను శానిటైజ్ చేసుకోవాలి. 

  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరి శరీర ఉష్ణోగ్రతను థర్మో గన్‌ సాయంతో ఎంట్రీ గేట్ వద్ద పరీక్షిస్తారు. 

  • కోవిడ్ లక్షణాలు కనిపించిన, జ్వరంతో బాధపడుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేక గదిని కేటాయించారు. అక్కడ పరీక్ష రాసే వెసులుబాటు కల్పించారు. 

  • పరీక్ష రాసే అభ్యర్థులు తమతో పాటు ఎలాంటి డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వంటి పలు నిషేధిత వస్తువులను తీసుకురాకూడదు. ఏదైనా వస్తువుతో పరీక్ష హాల్ లోకి ప్రవేశించిన అభ్యర్థులను అనర్హులుగా పరిగణిస్తారు.


Also Read: Engineering Pharma Seats: తెలంగాణలో అందుబాటులోకి 94 వేల ఇంజినీరింగ్ సీట్లు... ఉన్నత విద్యా మండలి ప్రకటన... నేటి నుంచి వెబ్‌ ఆప్షన్లు


Also Read:  JEE Advanced Exam 2021 Registrations: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే?