NEET PG 2025 Supreme Court: సుప్రీం కోర్టు NEET-PG 2025 పరీక్షను ఆగస్టు 3కి మార్చడానికి అనుమతించింది. లాజిస్టికల్ ఏర్పాట్ల కోసం అదనపు సమయం కావాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్‌ల ధర్మాసనం ఈ వెసులుబాటు ఇచ్చింది.
మే 30న, సుప్రీం కోర్టు NBEMSని NEET-PG 2025ని ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశించింది. జూన్ 15న రెండు షిఫ్ట్‌లలో నిర్వహించాలన్న ప్రణాళికను రద్దు చేసింది. అసలు పరీక్ష తేదీని అనుసరించాలని ఆదేశిస్తూనే, సమర్థనీయ కారణాలతో అదనపు సమయం కోరవచ్చని కూడా కోర్టు అనుమతించింది. తర్వాత, NBEMS అదనపు సమయం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. పరీక్ష కేంద్రాల సంఖ్యను 450 నుండి 900కి రెట్టింపు చేయడం , భద్రతా ప్రోటోకాల్‌లను మెరుగుపరచడం అవసరమని పిటిషన్‌లో పేర్కొంది. NBEMS, టెక్నాలజీ భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ప్రకారం, ఒకే షిఫ్ట్‌లో పరీక్షను నాణ్యత, న్యాయబద్ధత విషయంలో రాజీ పడకుండా పరచకుండా నిర్వహించడానికి ఆగస్టు 3 అత్యంత సాధ్యమైన తేదీ అని ఈ రెండు సంస్థలు చెప్పాయి.
ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించడానికి గణనీయమైన లాజిస్టికల్ అప్‌గ్రేడ్‌లు అవసరమని NBEMS వివరించింది. అభ్యర్థులకు కొత్త పరీక్ష నగరాలను ఎంచుకోవడానికి అప్లికేషన్ విండోను అందుబాటులోకి తేవడం, అభ్యర్థులను సవరించిన కేంద్రాలకు కేటాయించడం, పరీక్ష నగరం ,అడ్మిట్ కార్డ్ వివరాలను ముందుగానే తెలియజేయడం వంటివి చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే NBEMS సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కూడా ముఖ్యమని తెలిపింది. ఇందులో సురక్షిత కంప్యూటర్ ఆధారిత పరీక్ష సౌకర్యాలు, పవర్ బ్యాకప్‌లు, నెట్‌వర్క్ సపోర్ట్, నిఘా వ్యవస్థలు వంటి వాటిని సిద్దం చేసుకోవాల్సి ఉందన్నారు. ఇన్విజిలేటర్లు, భద్రతా సిబ్బంది, ఐటీ స్టాఫ్‌ను నియమించడం, శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపింది.
NEET-PGని హై-స్టేక్స్ పరీక్షగా పేర్కొన్నారు. మోసాలను నిరోధించడానికి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో సమన్వయం, బలమైన యాంటీ-చీటింగ్ చర్యల అమలు కీలకమని తెలిపింది. సుప్రీంకోర్టు రీషెడ్యూల్ కు అంగీకరించింది.