NEET PG exam postponed News |దేశంలోకి వైద్యకళాశాలల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 23న నిర్వహించనున్న నీట్ పీజీ-2024 ప్రవేశ పరీక్షను కేంద్రం వాయిదావేసింది. త్వరలోనే పరీక్ష కొత్త తేదీని ప్రకటిస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ జూన్ 22న ఒక ప్రకటనలో తెలిపింది. నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీట్ పీజీ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. కాగా దేశవ్యాప్తంగా 300 నగరాల్లో వెయ్యికి పైగా పరీక్షా కేంద్రాల్లో నీట్ పీజీ- 2024 పరీక్ష జరగాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించాల్సి ఉంది. ఈ పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహానికి లోనవుతున్నారు.


మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్-పీజీ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రక్రియల పటిష్టతను క్షుణ్ణంగా అంచనా వేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే నీట్ పీజీ పరీక్షను వాయిదావేసింది. విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి ఆరోగ్య మంత్రిత్వ శాఖ మనస్ఫూర్తిగా చింతిస్తోంది. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా, పరీక్షా ప్రక్రియ పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.


దేశవ్యాప్తంగా జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్-2024 పరీక్షను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష జరిగిన మరుసటి రోజే యూజీసీ నెట్‌ పరీక్ష ప్రశ్నపత్రం డార్క్‌నెట్‌లో లీక్ అయినట్లు సైబర్‌ క్రైమ్‌ విభాగానికి సమాచారం రావడంతో.. పారదర్శకతను కాపాడటం కోసం పరీక్షను రద్దుచేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. మళ్లీ యూజీసీ నెట్ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నీట్‌ 2024 పరీక్ష సహా పలు పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో కేంద్రం ఈ తరహా నిర్ణయం తీసుకుంది. దీంతో అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించనుంది. ఇక జూన్‌ 25, 26, 27 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్‌ పరీక్షను జూన్ 21న  వాయిదా వేసింది. కొన్ని అనివార్య పరిస్థితులు, లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందులో పేపర్ లీక్ ఏమీ లేదని, అయితే లాజిస్టిక్ సమస్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.


NTA డైరెక్టర్‌పై వేటు..
నీట్‌ యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలోనే NTA డైరెక్టర్‌ పదవి నుంచి సుబోధ్‌ కుమార్‌పై కేంద్రం వేటువేసింది. దేశంలో రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో శనివారం (జూన్ 22) రాత్రి విధుల నుంచి ఆయనను తొలగించింది. సుబోధ్‌ స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను NTA డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం నియమించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవిలో కొనసాగనున్నారు. గతేడాది జూన్‌లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్‌గా సుబోధ్‌ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అడిషనల్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. 2009-2019 మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్ సెక్రటేరియట్‌లో పలు హోదాల్లో సుబోధ్ పనిచేశారు.