NEET Paper Leak Scam: నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర వైఫల్యానికి కారణం కేవలం కొందరు వ్యక్తుల స్వార్థం మాత్రమే కాదు, ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో ఉన్న L1 నిబంధన అని బయటకు వస్తున్న వివరాలను బట్టి స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో అపారమైన అనుభవం, అత్యాధునిక సాంకేతిక భద్రత కలిగిన TCS వంటి సంస్థను కేవలం 140 వ్యత్యాసం కారణంగా పక్కన పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఒక్కో అభ్యర్థికి TCS కోట్ చేసిన రూ. 311కు బదులుగా, కేవలం రూ.171కే నిర్వహిస్తామన్న EduQuest సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడమే కొంపముంచిందని తాజాగా గుర్తించారు.
అవినీతిని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన L1 అతి తక్కువ ధర కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్ ఇవ్వడం విధానం ఇక్కడ శాపంగా మారింది. సిమెంట్, ఇనుము వంటి వస్తువుల కొనుగోలుకు ఈ సూత్రం పనికొస్తుందేమో కానీ, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అత్యంత రహస్యమైన పరీక్షా నిర్వహణకు ఇది ఏమాత్రం సరిపోదని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధర కోట్ చేసిన సంస్థలు లాభాల కోసం భద్రతా ప్రమాణాల్లో రాజీ పడటం, సిబ్బంది నాణ్యతను తగ్గించుకోవడం వంటి చర్యలకు పాల్పడతాయి. అదే ఇక్కడ EduQuest విషయంలో జరిగిందని, సైబర్ సెక్యూరిటీ వైఫల్యాలే పేపర్ లీక్‌కు దారితీశాయని స్పష్టమవుతోంది.
వ్యవస్థ తన నిబంధనల ప్రకారమే నడిచింది, కానీ ఆ నిబంధనే ఒక అసమర్థ సంస్థ లోపలికి రావడానికి తలుపులు తెరిచింది. TCS వంటి సంస్థలు పదేళ్ల అనుభవంతో తమ భద్రతా వలయాన్ని పటిష్టం చేసుకున్నాయి. అయితే, ప్రభుత్వం కేవలం అంకెల గణితాన్ని మాత్రమే చూసి, సాంకేతిక సామర్థ్యాన్ని విస్మరించింది. నిబంధనల ప్రకారం పారదర్శకంగానే టెండర్లు కేటాయించినప్పటికీ, ఆ పారదర్శకత వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని గుర్తించలేకపోవడం వ్యవస్థా పరమైన అజ్ఞానమా లేక నిర్లక్ష్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేవలం రూ. 140 పొదుపు చేయడానికి చూసిన ప్రభుత్వం, ఇప్పుడు దేశవ్యాప్తంగా పరీక్షల విశ్వసనీయతను కోల్పోవడమే కాకుండా, రీ-ఎగ్జామ్స్ నిర్వహణ కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అంతకంటే ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న మానసిక క్షోభ వెలకట్టలేనిది. వ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని భద్రతతో రాజీపడే సంస్థలకు జాతీయ స్థాయి పరీక్షల బాధ్యత అప్పగించడం అంటే, విషపు గింజలను మనమే నాటుకోవడమే అనే విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి L1 విధానానికి స్వస్తి పలికి క్వాలిటీ అండ్ కాస్ట్ బేస్డ్ సెలక్షన్ వంటి నాణ్యతకు పెద్దపీట వేసే పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని నిపుణులు సలహాలిస్తున్నారు. కేవలం ధరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ పోతే, భవిష్యత్తులో మరిన్ని పరీక్షలు లీకేజీల బారిన పడే ప్రమాదం ఉంది. పరీక్షా నిర్వహణ అనేది కేవలం ఒక వ్యాపారం కాదు, అది దేశ భవిష్యత్తుకు సంబంధించిన నైతిక బాధ్యత అని గుర్తించినప్పుడే ఇలాంటి వ్యవస్థాగత లోపాలు సరిదిద్దుకోవచ్చని అంటున్నారు.
