న్యూఢిల్లీ: చమురు వినియోగం సాధ్యమైనంత తగ్గించాలని, వర్క్ ఫ్రం హోం బెటర్ ఆప్షన్ అని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధనాన్ని పొదుపు చేసే ప్రయత్నంలో భాగంగా, ప్రధాని ఇప్పుడు స్వయంగా దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. నివేదికల ప్రకారం, ప్రధాని మోదీ తన అధికారిక కాన్వాయ్ లోని వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం కేవలం ఇంధనాన్ని ఆదా చేయడం మాత్రమే కాదు, ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించడం. ఈ చర్య ద్వారా మోదీ కాన్వాయ్‌లో ఎంత పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుందో వివరాలు ఇక్కడ అందించే ప్రయత్నం చేస్తున్నాం.

Continues below advertisement

గతంలో ఎన్ని వాహనాలు వాడేవారు.. ప్రధాని కాన్వాయ్‌లో సాధారణంగా అనేక భద్రతా, సహాయక వాహనాలు ఉంటాయి. వీటిలో SUVలు, భద్రతా ఎస్కార్ట్ వాహనాలు, అంబులెన్సులు, టెక్నాలజీ సంబంధిత సహాయక వాహనాలు ఉంటాయి. మీడియా నివేదికల ప్రకారం, గతంలో ప్రధాని మోదీ వాహన శ్రేణిలో సుమారు 18 నుండి 20 వాహనాలు ఉండేవి. ఇప్పుడు ఈ సంఖ్యను సుమారు 9 నుంచి 10 వాహనాలకు తగ్గించారు. అయితే, భద్రతా ఏర్పాట్ల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకున్నారు. 

ఎంత ఇంధనం వినియోగించేవారు..ప్రధానమంత్రి వాహన శ్రేణిలో ఉపయోగించే వాహనాల్లో ఎక్కువ భాగం పెద్ద SUVలే ఉంటాయి. ఇవి లీటరుకు సగటున 6 నుండి 8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఒక అధికారిక పర్యటనలో పీఎం కాన్వాయ్ 100 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, గతంలో ఇంధన వినియోగం సుమారు 250 నుండి 300 లీటర్ల వరకు ఉండేది. వాహనాల సంఖ్య సగానికి తగ్గడంతో, ఇప్పుడు ఈ వినియోగం దాదాపు సగానికి తగ్గుతుంది. ప్రతి అధికారిక పర్యటనలో 100 నుండి 150 లీటర్ల ఇంధనాన్ని ఆదా చేయవచ్చు అని అంచనా వేశారు. ఏడాదిపాటు జరిగే మొత్తం అధికారిక పర్యటనలను పరిగణనలోకి తీసుకుంటే, తాజా నిర్ణయం ద్వారా వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. 

Continues below advertisement

ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహంవిశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సాధ్యమైన చోట తమ కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) చేర్చాలని ప్రధాని మోదీ అధికారులకు సూచించారు. ఈ చర్య పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని మరింత తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది. 

ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తిఇంధన వినియోగం తగ్గించాలని, సాధ్యమైనంత పొదుపు చేయాలని ప్రధాని మోదీ గతంలోనే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెట్రో, రైల్వేలు, కార్‌పూలింగ్ సేవలను, ఆర్టీసీని వినియోగించుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు కలిగిన వారు వాటిని మరింతగా ఉపయోగించాలని ప్రోత్సహించారు.  వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా  ప్రస్తావించారు. దేశంలోని ప్రతి పౌరుడూ చేసే చిన్న ప్రయత్నం ఎంతో మార్పు తీసుకొస్తుందన్నారు. దానివల్ల భారత ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం సాధ్యమేనని ప్రధాని మోదీ విశ్వసిస్తున్నారు.