న్యూఢిల్లీ: నీట్ యూజీ 2026 ఎగ్జామ్ రద్దు అయింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. పేపర్ లీకేజీ ఆరోపణలతో విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని NTA ఈ నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేసినట్లు ప్రకటించింది. పేపర్ లీకేజీపై కొన్ని రోజులనుంచి దుమారం రేగగా, ఎన్టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.
రాజస్తాన్‌లో మొదలైన వివాదం..రాజస్థాన్‌లో నీట్ (NEET UG 2026) వివాదం చివరికి కొలిక్కి వచ్చింది. దాదాపు 125 ప్రశ్నలు లీకయ్యాయని.. ఆ క్వశ్చన్స్ ఓ శాంపిల్ పేపర్‌తో యథాతథంగా మ్యాచ్ కావడంతో వివాదం మొదలైంది. అప్పటి నుండి ఎగ్జామ్ రద్దు అవుతుందని వినిపించింది. విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ మే 3న జరిగిన ఈ పరీక్షను రద్దు చేయడంతో పాటు మళ్లీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తారు. విద్యార్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఈ వ్యవహారంపై సిబిఐ (CBI) దర్యాప్తు చేయనుంది. విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మరాదని కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచించారు.
పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు:
నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేసింది.
మే 3న జరిగిన పరీక్షను మళ్లీ నిర్వహిస్తారు.
ఎగ్జామ్ కొత్త తేదీని త్వరలోనే విడుదల చేస్తారు.
అడ్మిట్ కార్డులను మళ్లీ జారీ చేస్తారు.
విద్యార్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ముందుగా జమ చేసిన ఫీజును తిరిగి చెల్లిస్తారు.
పరీక్షా కేంద్రం ఎంపిక మునుపటిలాగే ఉంటుంది.
ఈ కేసు దర్యాప్తును సిబిఐ (CBI)కి అప్పగించారు.
విద్యార్థులు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు సూచించారు.
రాజస్థాన్ సహా కొన్ని రాష్ట్రాల్లో సాధారణ శాంపిల్ పేపర్‌లో ఉన్న సుమారు 125 ప్రశ్నలు నీట్ పేపర్‌తో అచ్చుగుద్దినట్లు సరిపోలాయని వివాదం మొదలైంది. ఆ తర్వాత పరీక్ష నిర్వహణ, పేపర్ లీకేజీపై వరుసగా ప్రశ్నలు తలెత్తాయని ఎన్టీఏ తెలిపింది. ఏబీపీ న్యూస్ కథనం తర్వాత విచారణ, ధృవీకరణ జరిగింది. ప్రస్తుతం ఉన్న పరీక్షా ప్రక్రియను కొనసాగించలేమని గుర్తించడంతో, ఎన్టీఏ (NTA) నీట్ యూజీ ఎగ్జామ్ రద్దు చేయాలని నిర్ణయించింది.
పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని తెలిపిన NTANTA తన 10 మే 2026 నాటి ప్రెస్ రిలీజ్ తర్వాత ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. అందులో 8 మేన NEET UG 2026కు సంబంధించిన కొన్ని అంశాలను విచారణ కోసం కేంద్ర సంస్థలకు పంపినట్లు పేర్కొంది. NEET UG పరీక్షకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు, అవకతవకలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరగాలని భావించాం. ఎగ్జామ్ నిబద్ధత, విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ అంశాలపై స్వతంత్ర విచారణ జరిపిస్తామని NTA తెలిపింది. అందుకే, వాస్తవాలను ధృవీకరించడానికి, బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించింది. జాతీయ స్థాయి పరీక్షలను“fair, secure and credible” గా నమ్మదగిన రీతిలో నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని NTA ఓ ప్రకటనలో పేర్కొంది. దాంతోపాటు ఎగ్జామ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐ ఈ కీలకమైన కేసును దర్యాప్తు చేసి నిజాలను వెలికితీయనుంది.
