NEET PG 2025: దేశంలోని వైద్యకళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 15న నిర్వహించనున్న 'నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌ (NEET-PG)' ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు 'నేషనల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NBEMS)' జూన్ 2న ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసినట్లు తెలుస్తోంది. వాయిదాపడిన నీట్‌ పీజీ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనునట్లు వెల్లడించింది. ఇటీవల సుప్రీంకోర్టు విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించడంతో పాటు, పరీక్ష ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించేందుకు ఒకే షిఫ్ట్‌లో పరీక్షలను నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్‌బీఈ చేసిన వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

కోర్టు ఆదేశాల నేపథ్యంలో నీట్‌ రద్దు..కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్‌బీఈ నీట్‌ పీజీ పరీక్షను రద్దు చేసింది. పరీక్ష కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉన్నందున పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్‌బీఈ నిర్వహించే నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా నీట్‌ ద్వారానే దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లను భర్తీ చేస్తుంటారు. 

ఒకే షిఫ్ట్‌లో పరీక్షలు..2024లో నీట్‌ పీజీ రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ రెండు షిఫ్ట్‌లలో వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండడంతో ఒక షిఫ్ట్‌లోని ప్రశ్నలు సులభంగా, మరొక షిఫ్ట్‌లోని ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆదేశించింది. 2024లో నీట్ పరీక్ష పత్రాల లీకేజీ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి అలాంటి ఘటనలు చేసుకోకుండా ఎన్టీఏ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే పరీక్ష నిర్వహణలో ఈ మార్పులు చేసింది.

నీట్ పీజీ పరీక్ష విధానం..నీట్ పీజీ పరీక్షను మొత్తం 800 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే పరీక్షలో మొత్తం మూడు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పరీక్షకు 4 మార్కులు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం మూడున్నర గంటలు. ఇంగ్లిష్‌ మాధ్యమంలో మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

ఒకే షిఫ్టులో పరీక్షపై చర్చ..నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలనే నిర్ణయంపై గతేడాది కూడా జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. మేధావులు, డాక్టర్లు, విద్యార్థుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. నీట్ పీజీ పరీక్షను రెండు దశల్లో నిర్వహించాలని చూడటం సరైంది కాదని వారు ప్రశ్నించారు. దీనివల్ల అన్‌ఫెయిర్ స్కోరింగ్, న్యాయపరమైన వివాదాలు, అభ్యర్ధుల్లో ఒత్తిడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. అదే తప్పుల్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకే షిఫ్ట్‌లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు గతేడాది యునైటెడ్ డాక్టర్స్ ఫోరమ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.