తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో విద్యాశాఖ మంత్రి సబిత ఏప్రిల్ 4న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. 


ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని మంత్రి సబితా స్పష్టంచేశారు. 


పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావులేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు.


అయితే అంతకుముందు పరీక్షల నిర్వహణ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు మంత్రి సబిత ట్విటర్ ద్వారా పలు సూచనలు చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్ అవడాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై ఆరా తీసిన ఆమె.. వరంగల్, హనుమకొండ డీఈవోలతో ఇప్పటికే మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. 


పదోతరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేద్దాం. మొదటిసారి బోర్డు పరీక్షలు రాస్తున్న చిన్నారులను గందరగోళానికి గురిచేయాలని ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయ, వ్యక్తిగత స్వార్థాన్ని వీడాలి అని మంత్రి సబిత విజ్ఞప్తి చేశారు.  






Also Read:


తెలంగాణలో నేడు హిందీ పేపర్ లీక్ - కాసేపటికే వాట్సప్‌లో చక్కర్లు!
తెలంగాణలో పదో తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. నేడు హిందీ పరీక్ష జరుగుతుండగా, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే హిందీ పేపర్ బయటికి వచ్చింది. దీన్ని వాట్సప్ గ్రూపులో కొందరు షేర్ చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పేపర్ లీక్ జరిగింది. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది.  SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ హిందీ ప్రశ్న పత్రం ప్రత్యక్షం అయినట్లుగా తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మిగతా 'పది' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి!
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠ‌శాల‌-1లో సోమ‌వారం ఉద‌యం తెలుగు ప్రశ్నాప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 4న జరిగే ప‌రీక్ష వాయిదా వేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ క‌థ‌నాల‌పై రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష వాయిదా ప‌డ‌లేద‌ని పాఠ‌శాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. ఏప్రిల్ 4 నుంచి 13 వ‌ర‌కు అన్ని ప‌రీక్షలు నిర్వహిస్తామ‌ని స్పష్టం చేసింది. ఇక తెలుగు ప్రశ్నాప‌త్రాన్ని వాట్సాప్ ద్వారా బ‌య‌ట‌కు పంపిన వ్యవ‌హారంలో న‌లుగురు ఉద్యోగుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ‌సేన ప్రక‌టించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..