Inter Student: చదువుల తల్లి - పేదరికాన్ని అధిగమించి, బాల్య వివాహాన్ని ఎదిరించి ఇంటర్ టాపర్ గా!

Andhrapradesh News: ఆ విద్యార్థిని బాల్య వివాహాన్ని ఎదిరించి మరీ అధికారుల సాయంతో ఇంటర్ కేజీబీవీలో అడ్మిషన్ పొందింది. ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచి సత్తా చాటింది.

Continues below advertisement

Adoni Student Top Marks In Inter Exams: చదువుకోవాలన్న ఆశ ఉంది. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదల ఉంది. కానీ, పేదరికం అడ్డు వచ్చింది. ఇంతలో ఆమె తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చిన్న వయసులోనే పెళ్లి చేయాలని భావించారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ బాలిక అధికారులను ఆశ్రయించింది. వారి సహాయంతో బాల్య వివాహం నుంచి బయటపడి.. కేజీబీవీలో ఇంటర్ లో గతేడాది అడ్మిషన్ పొందింది. సరిగ్గా ఏడాది తర్వాత శుక్రవారం విడుదలైన ఫలితాల్లో టాపర్ గా నిలిచి సత్తా చాటింది. పేదరికాన్ని అధిగమించి.. బాల్య వివాహాన్ని ఎదిరించి.. పట్టుదలతో మంచి మార్కులు సాధించిన ఆమెను అంతా ప్రశంసిస్తున్నారు.

Continues below advertisement

బాల్య వివాహాన్ని ఎదిరించి మరీ..

కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, హనుమంతమ్మ దంపతుల కుమార్తె నిర్మలకు చదువంటే చాలా ఇష్టం. పదో తరగతిలో 573 మార్కులు సాధించింది. అయితే, ఉన్నత చదువులు చదవాలన్న ఆమెకు పేదరికం అడ్డు వచ్చింది. ఆర్థిక పరిస్థితులతో చదువు మానేసి తల్లిదండ్రులతో పాటు కూలీ పనులకు వెళ్లేది. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేసిన నిర్మల తల్లిదండ్రులు ఆమెకు కూడా చిన్న వయసులోనే పెళ్లి చేయాలని భావించారు. సమీపంలో ఇంటర్ కాలేజీ కూడా లేదని ఉన్నత చదువులు చదివించలేమని ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశారు.

అయితే, బాగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలన్న పట్టుదలతో ఉన్న నిర్మల.. బాల్య వివాహం నుంచి కాపాడాలని అధికారులను ఆశ్రయించింది. జిల్లా కలెక్టర్ సృజన చొరవతో అధికార యంత్రాంగం నిర్మల బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అంతే కాకుండా ఆమెను ఆలూరు కేజీబీవీలో ఇంటర్ బైపీసీ ఫస్టియర్ లో చేర్పించారు. దీంతో కష్టపడి చదివిన నిర్మల ఇంటర్ ఫలితాల్లో టాపర్ గా నిలిచి సత్తా చాటింది. 440 మార్కులకు 421 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. బాల్య వివాహం నుంచి బయటపడిన నిర్మల టాపర్ గా నిలవడంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు, కలెక్టర్, అధికారులు సైతం ఆమెను అభినందించారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా నిర్మలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. తన చదువుకు సహాయం చేసిన కలెక్టర్, అధికారులకు నిర్మల కృతజ్ఞతలు తెలిపారు. ఐపీఎస్ అధికారిణి కావాలనేది తన లక్ష్యం అని చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తానని అన్నారు.

Also Read: Balakrishna: సెల్ఫీ దిగేందుకు యత్నం - అభిమానిని నెట్టేసిన బాలకృష్ణ, వీడియో వైరల్

Continues below advertisement