Balakrishna Pushed Fan In Kadiri: ఏపీలో పార్టీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార, ప్రతిపక్ష నేతలు.. విమర్శలు, ప్రతి విమర్శలు, రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో భాగంగా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి సిద్ధమయ్యారు. సత్యసాయి జిల్లా కదిరిలో (Kadiri) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఉమ్మడి అనంతపురం (Anantapuram) జిల్లాలోనే 2 రోజుల పాటు క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హెలికాఫ్టర్ లో కదిరి చేరుకున్నారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సమాయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన హెలికాఫ్టర్ దిగగానే అభిమానులు భారీగా ఆయన వైపు దూసుకొచ్చారు. జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఓ అభిమాని ఆయన వద్దకు వచ్చి సెల్ఫీ దిగేందుకు యత్నించగా.. ఆయన ఆగ్రహంతో తన మోచేయితో నెట్టేశారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన బాలకృష్ణ సెక్యూరిటీ అభిమానుల్ని కట్టడి చేసేందుకు యత్నించారు. కాగా, బాలయ్య అభిమానిని నెట్టేసిన వీడియో వైరల్ అవుతోంది. అనంతరం కదిరిలోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు, అలం ఖాన్ దర్గాలో ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత కదిరి నియోజకవర్గంలోని నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు.



'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'


ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలకృష్ణ ఆదివారం నుంచి బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో ఆయన బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇందుకోసం 'బాలయ్య అన్ స్టాపబుల్' అంటూ ఓ ప్రత్యేక బస్సును సైతం సిద్ధం చేశారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో బాలయ్య పర్యటనలు కొనసాగుతాయి. ఈ బస్సు యాత్ర కదిరి , పుట్టపర్తి, అనంతపురం నియోజకవర్గాల్లో జరగనుంది. ఏప్రిల్13న (ఆదివారం) శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో, ఏప్రిల్ 14న బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఏప్రిల్ 15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు , ఏప్రిల్ 16న కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ నెల 17న పత్తికొండ, ఆలూరు, రాయదుర్గ్ ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. 


19న నామినేషన్


మూడోసారి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బాలకృష్ణ బరిలో నిలుస్తున్నారు. 1985 నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఖాయమని ఆయన అంచనా వేసుకుంటున్నారు. బాలయ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో చేపట్టనున్న ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. ఏప్రిల్ 19న హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. రెండు విడతలుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రూ.వందల కోట్లతో హిందూపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రజల స్వప్నం అయిన నీటి సమస్యను పరిష్కరించారు. తర్వాత టీడీపీ ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కరోనా సమయంలో ఆస్పత్రులకు తన సొంత ఖర్చులతో ఎక్విప్ మెంట్ అందించారు. స్టార్ క్యాంపెయినర్ కావడంతో తన నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల్లోనూ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.       


Also Read: Nagarjuna Sagar: తాగునీటి అవసరాలకు సాగర్ నుంచి కేటాయింపులు - ఏపీ, తెలంగాణకు ఎన్ని టీఎంసీలంటే?