JoSAA Counselling Schedule 2024: దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 9న వెల్లడించిన నేపథ్యంలో.. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు జూన్ 10 నుంచి రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష రాసినవారు, ఫలితాల వెల్లడి తర్వాత జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 19 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 20 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 5 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 


జూన్ 10 నుంచి జులై 23 వరకు మొత్తం 44 రోజులపాటు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్‌ ఐటీల్లో మరో 16 వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈసారి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యాసంస్థల సంఖ్య పెరిగింది. గతేడాది 114 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 121కి పెరిగింది. 


JoSAA Counselling ఇలా..


♦ 1వ రౌండ్‌ : జూన్ 20 నుంచి జూన్ 26 వరకు


♦ 2వ రౌండ్‌: జూన్ 27 నుంచి జులై 3 వరకు


♦ 3వ రౌండ్‌: జులై 4 నుంచి జులై 9 వరకు


♦ 4వ రౌండ్‌: జులై 10 నుంచి జులై 16 వరకు


♦ 5వ రౌండ్‌: జులై 17 నుంచి జులై 23 వరకు


♦ 6వ రౌండ్‌ (NIT+ System మాత్రమే): జులై 17 నుంచి  జులై 26 వరకు నిర్వహిస్తారు. 


5 రౌండ్ల సీట్ల కేటాయింపు తేదీలు..


♦ 1వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 20న


♦ 2వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జూన్ 27న


♦ 3వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జులై 4న


♦ 4వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జులై 10న


♦ 5వ రౌండ్‌ సీట్ల కేటాయింపు: జులై 17న



జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు జూన్ 9 వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి.. పరీక్షకు మొత్తం 1,80,200 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. 


జేఈఈ అడ్వాన్స్‌డ్-2024 ఫలితాలు, ఫైనల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి..





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..