ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీలు), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 తుది ఫలితాలు ఈ నెల 6న వెలువడనున్నాయి. అభ్యర్థుల స్కోరుతోపాటు ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను జూలై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరయ్యారు.
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షల ప్రాథమిక కీని ఎన్‌టీఏ ఆగస్టు 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాథమిక కీపై అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఆగస్టు 5 (శుక్రవారం) సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేయడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు ఒక్కొక్క ప్రశ్నకు ఇచ్చిన కీపై ఆధారాలతో రూ.200 చొప్పున ఫీజు చెల్లించి చాలెంజ్ చేయొచ్చని వెల్లడించింది. పేపర్–1.. బీఈ, బీటెక్, పేపర్ 2ఏ.. బీఆర్క్, పేపర్ 2బీ.. బీప్లానింగ్ పరీక్షల ప్రాథమిక కీలను వేర్వేరుగా ఎన్‌టీఏ https://jeemain.nta.nic.in లో పొందుపరిచింది.
Also Read: MAT 2022 Notification: మేనేజ్‌మెంట్ కోర్సులకు సరైన మార్గం ‘మ్యాట్’
ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి ఎన్‌టీఏ తుది నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవి అయితే ప్రాథమిక కీని సవరించి తుది కీని విడుదల చేస్తుంది. కాగా తుది కీ అనంతరం ఆగస్టు 5 అర్ధరాత్రి లేదా 6న జేఈఈ మెయిన్ స్కోరు, ర్యాంకుల వారీగా తుది ఫలితాలను విడుదల చేయనుంది.
జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జులై 25 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6.29లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అంతకుముందు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించగా.. ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన యశ్వంత్, ఏపీకి చెందిన ఆదినారాయణ పి, కే సహాస్, పి రవిశంకర్ 100 పర్సంటైల్ సాధించడం విశేషం.
Also Read: బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!
జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 7 నుంచి..
ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం జాతీయ స్థాయిలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced) ఎంతో కీలకం. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్- 2022 కోసం ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రారంభ దశలో విదేశీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మాత్రమే అనుమతించారు. ఇక భారతీయ విద్యార్థుల కోసం జేఈఈ మెయిన్ (JEE Main Results) ఫలితాల తర్వాత అప్లికేషన్ కమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ అభ్యర్థులు ఆగస్టు 7 నుంచి 11లోపు అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 28న అడ్వాన్స్‌డ్ పేపర్–1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ తుది ఫలితాలను సెప్టెంబర్ 11న ప్రకటించనున్నారు.