అకడమిక్ పరీక్షలు పూర్తైన విద్యార్థులు కాంపిటీటివ్‌ పరీక్షలకు సిద్దమవుతున్నారు. ఆ పరీక్షలకు సంబంధించిన తేదీలు దగ్గర పడుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటికే చాలా ఎంట్రన్స్ నోటఫికేషన్లు వచ్చాయి. కొన్నింటికి గడువు ముగిస్తే మరికొన్నింటికి ఇంకా దరఖాస్తు తేదీ ముగియనుంది. ఇంకా మరికొన్ని నోటిఫికేషన్లు రానున్నాయి. 


చాలా మంది చాలా రకాల పరీక్షలు రాస్తున్న ఈ టైంలో అటు చదువు టెన్షన్‌తోపాటు ఇటు పరీక్ష ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, హాల్‌టికెట్ ఎప్పుడు డౌన్ లోడ్ చేసుకోవాలనే కంగారు సహజంగానే ఉంటుంది. అలాంటి వారికి పని సులభతరం చేసేందుకు జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలను ఒక్కచోట అందిస్తున్నాం.


జేసీసీ మెయిన్ 2022


దేశంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రేవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్ ఎజెన్సీ(NTA) నిర్వహించే జాయంట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ మెయిన్‌ పరీక్ష కోసం లక్షల మంది ప్రిపేర్ అవుతుంటారు. ఇందులో మంచి ర్యాంక్ సాధించిన వాళ్లు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నిట్స్‌ లాంటి పేరున్న సంస్థల్లో కూడా సీట్లు రానున్నాయి. అందుకే దీనికి చాలా పోటీ ఉంటుంది. 


ఈ పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. జేఈఈ మెయిన్, జేఈఈ డ్వాన్స్‌డ్‌ ఉంటుంది. జేఈఈ మెయిన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైంది. రెండో దశకు చెందిన ప్రక్రియ జూన్1న మొదలైంది. జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌  పరీక్ష జూన్ 20 నుంచి 29 మధ్య జరగనుంది. జేఈఈ అడ్వాన్స్డ్‌ పరీక్ష జులై 21 నుంచి 30 మధ్య జరగనుంది. మెయిన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులు ఈ వారంలో విడుదల అయ్యే అవకాశం ఉంది. 


మణిపాల్ ప్రవేశ పరీక్ష


MET లేదా మణిపాల్ ప్రవేశ పరీక్ష అనేది మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్ యూనివర్శిటీ జైపూర్, సిక్కిం మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి విశ్వవిద్యాలయంలో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పరీక్ష. MET ఫేజ్ 2 స్లాట్ బుకింగ్‌కు కూడా ఇవాల్టితో ముగిసింది. 


బిట్సాట్‌ 


బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)లోని వివిధ శాఖలలోకి విద్యార్థులను చేర్చుకోవడానికి బిట్సాట్-2022 నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు సాధించిన విద్యార్థులు పిలానీ, గోవా, హైదరాబాద్ వంటి ఏదైనా బ్రాంచ్‌లో ప్రవేశం పొందవచ్చు. BITSAT 2022 నమోదు ప్రస్తుతం కొనసాగుతోంది. జూన్ 10 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.


సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ 


భారతదేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలలో ప్రవేశాల కోసం మొదటిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. సెంట్రల్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022ని ఢిల్లీ యూనివర్సిటీ, JNU, జామియా మొదలైన అనేక అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ టెస్ట్‌గా ఎంచుకుంటాయి. విద్యార్థులు CUET ద్వారా ఇంజనీరింగ్ కోర్సులను ఎంచుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైంది. ఈ నెలలోపు అడ్మిట్ కార్డు విడుదల కావచ్చు. జూలై మొదటి, రెండో వారంలో పరీక్ష జరగనుంది.


వీటీఈ


ఇది కూడా జాతీయ స్థాయి పరీక్ష. అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను VIT యూనివర్సిటీ నిర్వహిస్తుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, బయాలజీ, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టుల్లో ప్రవేశం కోసం పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్‌ ఎగ్జామ్. జూన్ 30 నుంచి జూలై 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.


నీట్ 2022


నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 దరఖాస్తు ప్రక్రియ మే 20న ముగిసింది. పరీక్ష జూలై 17న జరగాల్సి ఉంది. ఈ ఏడాది పరీక్ష విధానంలో మార్పులు చేశారు. విద్యార్థులు పరీక్ష రాయడానికి 3 గంటల 20 నిమిషాల సమయం ఇస్తారు. ఈ ఏడాది మెడికల్ ప్రవేశ పరీక్షకు 18.72 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.