అమరావతికి అనుకూలంగా రైతులు చేస్తున్న ఉద్యమం 900 రోజులైన సందర్భంగా అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో పాల్గొన్న మేథావులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధాని నిర్మాణ విషయంలో ఏపీ హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింద‌ని దాన్ని నుంచి తప్పించుకొని ప్రభుత్వం రాజధానిని మార్చలేదని వాళ్లంతా అభిప్రాయపడ్డారు.  అమరావతిపై హైకోర్టు తీర్పు - సర్కారు తీరు అనే అంశంపై వచ్చిన వాళ్లంతా విజయవాడలో సమావేశమై చర్చించారు. 


ప్రభుత్వానిది కోర్టు ధిక్కరణ: గోపాల గౌడ్ 


రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుని  ప్రభుత్వం మారగానే దానికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం సరికాదని సుప్రీం కోర్టు మాజీ న్యాయ‌మూర్తి గోపాల గౌడ్ అభిప్రాయ‌ప‌డారు. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు చట్టబద్దం, రాజ్యాంగ బద్దంగా ఉందన్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు తీసుకుని రైతులకు విశ్వాసం కల్పించి ప్రభుత్వం మారగానే దానికి భిన్నంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు.. న్యాయ స్థానం చెప్పినా దాన్ని అమలు చేయకుండా ప్రభుత్వం ఏ ధైర్యంతో ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. మూడు నెలలు గడుస్తున్నా కోర్టు తీర్పును అమలు చేయకపోతే అది కచ్చితంగా కోర్టు తిరస్కరణ అవుతుందని స్పష్టం చేశారు.


ప్రజలకు ఎలా విశ్వాసం ఉంటుంది?: ప్రొఫెసర్‌ హరగోపాల్


నాలుగేళ్ల క్రితం అమరావతి వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉందన్నారు పౌరుహక్కుల నేత ప్రొఫెసర్‌ హరగోపాల్... ఒక్క నిర్మాణం కూడా పూర్తి చేయలేదని ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు ఎలా మారిపోతాయని నిలదీశారాయన. గత ప్రభుత్వం తప్పు చేసి ఉంటే దానిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టడం మాత్రం బాగాలేదన్నారు. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా ప్రభుత్వం పట్టించున్నట్టు  కనిపించడం లేదని.... ప్రభుత్వాలే ఇలా చేస్తే ప్రజల్లో ఎలా విశ్వాసం వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను నమ్మి మాత్రమే ప్రజలు భూములు ఇచ్చారని... అప్పటి పార్టీతో ప్రజలకు ఏం సంబంధమని అడిగారాయన. 


మోదీనే వెనక్కి తగ్గారు జగన్ ఓ లెక్కా?: గోపాలరావు 


రాజధాని అమరావతికి ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు అన్న వర్గాల వాళ్లు భూములు ఇస్తే ఓ సామాకి వర్గానికి పరిమితం చేస్తూ ప్రజాప్రతినిధులు చేస్తున్న విమర్శలను చర్చావేదికకు వచ్చిన మేథావులు ఖండించారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలరావు మాట్లాడుతూ... రైతులను ఇబ్బంది పెట్టి రాజకీయాలు చేయడమేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతి నుంచి రాజధాని తరలించడం ప్రభుత్వం వల్ల కాదని తెలిపారాయన. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని పెట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు గోపాలరావు. రాజధాని అక్కడే ఉంటుందని ఇప్పటికే కొన్ని నిర్మాణాలు ప్రారంభమయ్యాయని... కొన్ని విద్య, వైద్య సంస్థలు కూడా వచ్చాయని గుర్చు చేశారు. ఇదంతా ఆలోచించిన కోర్టులు ఇక్కడ ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దాన్ని  ఉల్లంఘిస్తున్న ప్రభుత్వంపై ధిక్కరణ కేసు పెట్టాలన్నారు గోపాలరావు. మోదీ లాంటి వ్యక్తే రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. 


పెద్ద కుమారుడికి కేంద్రం చెప్పలేదా?:కమలానంద భారతి


కేంద్రంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఇలా ఉందన్నారు ఆధ్యాత్మికవేత్త కమలానంద భారతి. రాజధాని లేకుండా రాష్ట్రం విభజించడం కాంగ్రెస్ చేసిన తప్పైతే... దాన్ని అంగీకరించి బీజేపీ అదే స్థాయి తప్పు చేసిందన్నారు. ఇప్పుడు రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని పాలించేలా సీఎం జగన్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోందన విమర్శించారు. జగన్‌ను పెద్ద కుమారుడిలా చూస్తున్న కేంద్రం.. రాజధానిపై సరైన దిశానిర్దేశం చేస్తే బాగుంటుందని సూచించారు. 


వికేంద్రీకరణకు వేరేగా మార్గాలున్నాయి: కోదండరామ్


వికేంద్రీకరణ చేయాలనుకుంటే దానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలే తప్ప అభివృద్ధి చెందుతున్న రాజధానిని ఎలా ముక్కలు చేస్తారని ప్రశ్నించారు ప్రొఫెసర్ కోదండరామ్‌. రైతుల మనోభావాలతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పని అభిప్రాయపడ్డారు. అదే టైంలో హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా అనుసరిస్తున్న వైఖరి కూడా ఏం బాగాలేదన్నారు.