JEE (Main) – 2025 Session-1Correction Window: జేఈఈ మెయిన్ 2025 సెషన్-1 దరఖాస్తుల సవరణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అవకాశం కల్పించింది. అభ్యర్థులు నవంబరు 26, 27 తేదీల్లో తమ వివరాల్లో తప్పులుంటే సరిచేసుకోవచ్చు. విద్యార్థులు జనవరి 27న రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తులు సవరించుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్-1 దరఖాస్తు సమయంలో వివరాలు తప్పుగా నమోదుచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే మొబైల్ నెంబరు, ఈమెయిల్, చిరునామా, ఫొటో, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డిటెయిల్స్ వివరాలు తప్ప మిగతా అన్ని వివరాల్లో మార్పులకు అవకాశం ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరు. ఒక్కసారి మాత్రమే వివరాలు సవరించుకునేందుకు అవకాశమిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వివరాలను సవరించుకోవాలని ఎన్టీఏ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇందుకోసం నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ కరెక్షన్ డైరెక్ట్ లింక్..
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తుల వెల్లువ..
జేఈఈ మెయిన్ 2025 సెషన్-1 పరీక్షలకు దరఖాస్తులు పోటెత్తాయి. జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు నవంబరు 22తో ముగిసిన సంగతి తెలిసిందే. పేపర్-1, పేపర్-2 పరీక్షలకు కలిపి దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పోటీపడుతున్నవారు సుమారు 1.50 లక్షల వరకు ఉన్నారు. గతేడాది జనవరి పేపర్-1 పరీక్షకు (బీటెక్ సీట్లకు) 12.21 లక్షలు, పేపర్-2కు (బీఆర్క్, బీప్లానింగ్ సీట్లు) 74 వేలు..మొత్తం 12.95 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిబంధనల కారణంగా ఈసారి తొలుత దరఖాస్తుల సంఖ్య నెమ్మదించినప్పటికీ.. గతేడాదితో పోలిస్తే స్వల్ప తగ్గుదలే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో తగ్గిన కేంద్రాలు..
జేఈఈ మెయిన్‌కు ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, కొత్తగూడెంలో పరీక్షా కేంద్రాలున్నాయి. ఈసారి కొత్తగా జగిత్యాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీలోడగ13 గతేడాది 29 చోట్ల జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించారు. అయితే విద్యార్థుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఈసారి 7 చోట్ల తగ్గించి.. 22 పట్టణాలు/నగరాలను మాత్రమే పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఎంపికచేసింది.
పరీక్షల షెడ్యూలు ఇలా..
జేఈఈ మెయిన్-2025 పరీక్షల షెడ్యూలును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అక్టోబరు 28న ప్రకటించింది. దీనిప్రకారం వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్టులో, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నారు. అలాగే జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలను ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 28 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థుల నుంచి నవంబరు 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 12న విడుదలవుతాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.
జేఈఈ మెయిన్ పరీక్ష విధానంలో మార్పులు..
జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు.. జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో మరోసారి నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన లేదా ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలో ఆప్షనల్ ప్రశ్నలను ఇకపై నిలిపివేస్తున్నట్లు ఇటీవల ఎన్టీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 కాలంలో ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే రాబోయే జేఈఈ మెయిన్ పరీక్షలో పేపర్‌లోని సెక్షన్-బిలో 10కి బదులుగా 5 ప్రశ్నలు మాత్రమే ఉండనున్నాయి. విద్యార్థులు ఎలాంటి ఆప్షనల్ లేకుండా మొత్తం 5 ప్రశ్నలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పరీక్ష విధానం..
➥పేపర్-1(బీటెక్, బీఈ) పరీక్ష
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్-ఎ 20 మార్కులు, సెక్షన్-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.
➥ పేపర్-2(ఎ) బీఆర్క్ పరీక్ష
నిట్‌లు,ట్రిపుల్ ఐటీలు,ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2(బి)బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష..
బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.
జేఈఈ మెయిన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..