AAT 2024 Registration: దేశంలోని ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్ష (ఏఏటీ)-2024' రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 9, 10 తేదీల్లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షను జూన్ 12న నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏఏటీ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ఫలితాలను జూన్ 14న విడుదల చేయనున్నారు. మరోవైపు జోసా కౌన్సెలింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 10 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఏఏటీ పరీక్ష ఫలితాల వెల్లడి తర్వాత అభ్యర్థులు జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 


JEE (Advanced) 2024 AAT Registration


జూన్ 10 నుంచి జోసా రిజిస్ట్రేషన్..
దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్దేశించిన జోసా(జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) షెడ్యూలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను జూన్ 9న వెల్లడించిన నేపథ్యంలో.. జూన్ 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. విద్యార్థులు జూన్ 10 నుంచి రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ పరీక్ష రాసినవారు, ఫలితాల వెల్లడి తర్వాత జూన్ 14 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీట్ల కేటాయింపునకు సంబంధించి జూన్ 19 వరకు అభ్యర్థులకు మాక్‌ కౌన్సెలింగ్‌ అందుబాటులో ఉంటుంది. దానివల్ల తమ ర్యాంకు ఆధారంగా ఎక్కడ సీటు వస్తుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. జూన్ 20 నుంచి అసలు ప్రక్రియ ప్రారంభంకానుంది. మొత్తం 5 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఫలితాలు జూన్ 9 వెలువడిన సంగతి తెలిసిందే. ఫలితాలకు సంబంధించి.. పరీక్షకు మొత్తం 1,80,200 మంది విద్యార్థులు హాజరుకాగా.. 48,248 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కేవలం 27 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించారు. పరీక్షలో అర్హత సాధించినవారిలో 40,284 మంది బాలురు ఉండగా.. 7,964 మంది బాలికలు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,43,637 మంది బాలురు దరఖాస్తు చేసుకోగా.. 1,39,180 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసినవారిలో 40,284 అర్హత సాధించారు. ఇక పరీక్షకు 42,947 మంది బాలికలు దరఖాస్తు చేసుకోగా..41,020 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 7,964 మంది మాత్రమే అర్హత సాధించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్-10 జాబితాల్లో ఐఐటీ మద్రాస్ జోన్ నుంచి ఏకంగా నలుగురు విద్యార్థులు టాపర్లుగా నిలిచారు. వీరంతా తెలుగు విద్యార్థులే కావడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్ విద్యార్థులు ముగ్గురు, ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఇద్దరు, ఐఐటీ రూర్కీ జోన్ పరిధిలో ఒక్కరు స్థానం సంపాదించారు. 


బాలుర కేటగిరీలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటీ టాపర్‌గా నిలిచాడు. మొత్తం 360 మార్కులకు 355 మార్కులతో కామన్ ర్యాంకింగ్ లిస్టులో మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిత్య (346), భోగల్‌పల్లి సందేశ్‌ (338), రిథమ్‌ కేడియా (337), పుట్టి కుషాల్‌ కుమార్‌ (334) టాప్-5లో నిలిచారు. బాలికల విభాగంలో ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేశ్ కుమార్ పటేల్ మొత్తం 360 మార్కులకు 332 మార్కులతో బాలికల విభాగంలో మొదటి స్థానంలో నిలవగా, కామన్ ర్యాంకింగ్ లిస్టులో 7వ స్థానంలో నిలిచింది. 





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి.