Engineering Internship: ఇంజినీరింగ్ విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తూ ఇంటర్న్‌షిప్ కల్పించేలా మల్టీనేషనల్ కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం(జీవీ) యూనివర్సిటీలోని వివిధ అభివృద్ధి పనులను మంత్రి బొత్స సత్యనారాయణ ఫిబ్రవరి 13న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్న్‌షిప్ కోసం ఇంజినీరింగ్ 4వ సంవత్సరం విద్యార్థుల కోసం నమోదు ప్రక్రియ ప్రారంభించామని.. 12 వేల మంది విద్యార్థులు ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్నారని చెప్పారు. మొత్తంగా 40 వేల మందికి లబ్ధి కలుగుతుందన్నారు. అటు ఎడెక్స్ సంస్థ ద్వారా 2 వేల ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రఖ్యాతి గాంచిన ఎడెక్స్ సంస్థ ద్వారా సుమారు 2 వేల ఆన్‌లైన్ కోర్సులను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కోర్సులకు ఫీజులను సైతం ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 16న సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. విద్యా సంస్థల్లో పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైనంత మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను కూడా నియమిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా సుమారు 2,200 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యాపకుల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నామని వివరించారు. విజయనగరంలోని జేఎన్‌టీయూ వర్సిటీని అత్యున్నత వర్సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తామన్నారు.
‘ఎడెక్స్’తో ఒప్పందం..
ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధం చేస్తూ విద్యా రంగ సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక అడుగు వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు ఇప్పటికే ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. పాఠ్యప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్‌ను చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి వర్సిటీల్లో ఎడెక్స్ కోర్సులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది.
ఎడెక్స్ కోర్సు ఇలా..
➥ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్ కోర్సులు అభ్యసించేలా కరిక్యులమ్‌లో భాగం చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో 2, 4వ సెమిస్టర్, ఇంజనీరింగ్‌లో 2, 4వ, 6వ సెమిస్టర్‌లలో ప్రతి విద్యార్థి వర్సిటీ/కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఎడెక్స్ అందించే అంతర్జాతీయ కోర్సులను అభ్యసించేందుకు అవకాశం ఉంది. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు మరింత అర్థవంతంగా బోధించేందుకు వీలుంటుంది. విద్యార్థులు ఎడెక్స్ ఆన్‌లైన్ కోర్సును తమకు అనువైన సమయంలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి నాలుగు గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్ ద్వారా మొబైల్ యాప్‌లో క్లాసులకు హాజరు కావచ్చు. సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్‌లైన్ సపోర్టింగ్ సిస్టమ్‌లో మెంటార్లు ఉంటారు. తద్వారా విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాలు పెరుగుతాయి.
➥ ఎడెక్స్‌తో రెగ్యులర్ కోర్సులు కాకుండా మార్కెట్ ఓరియంటెడ్ విద్య లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఫైథాన్ లాంటివి ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోవలో ఉన్నాయి. వీటిని నేర్చుకోవాలంటే బోధనా విధానంతో పాటు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచాలి. అత్యున్నత విశ్వవిద్యాలయాలు/సంస్థలకు చెందిన అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధించేలా ఎడెక్స్ దోహదం చేస్తుంది. తద్వారా విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను గుర్తించి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి.
ఉచితంగానే కోర్సులు..
ఎడెక్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పేరొందింది. ఇందులో 180కిపైగా వరల్డ్‌క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని 2 వేలకు పైగా వర్టికల్స్‌ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికిపైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్లకు పైగా వెచ్చించనుంది. రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతో పాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ లాంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్ కోర్సులను అందిస్తారు. ఆయా కళాశాలలు, వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్‌మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నాపత్రంతో వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు.