Minister Harish Rao : కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కూడా మంజూరు చేయలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశవ్యాప్తంగా 157 కళాశాలలు మంజూరు చేసినా రాష్ట్రానికి మొండిచేయి చూపారన్నారు. ఈ ఏడాదే 8 మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 850 మెడికల్‌ సీట్లు ఉంటే, గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2052 సీట్లు పెరిగాయన్నారు. ఇక్కడ తక్కువ సీట్లు ఉండడంతో తెలంగాణ విద్యార్థులు రష్యా, ఉక్రెయిన్‌, చైనాకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సీట్లు పెరిగితే తెలంగాణ విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవసరముండదన్నారు.  


కొత్త కాలేజీల్లో అడ్మిషన్లు 


రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఎనిమిది మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్‌లు ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. దీంతో రాష్ట్రంలో 1200 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. బి కేటగిరి సీట్లలో 85% స్థానికులకు కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మెడికల్‌ కాలేజీలు వస్తాయని ఉద్యమ సమయంలో అనుకున్న కల ఇప్పుడు నిజమైందన్నారు. సమైక్య రాష్ట్రంలో వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లలో మూడు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని హరీశ్ రావు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 


మెడికల్ కాలేజీలకు రూ.4080 కోట్లు 


"ఈ ఏడాది కొత్తగా ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీల్లో 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇది దేశ చరిత్రలో కీలక ఘట్టం. సమైక్య రాష్ట్రంలో మూడు కాలేజీలు మాత్రమే వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ సంఖ్యను 17 కాలేజీలకు పెంచాం. ఒకే విద్యా సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ ఒక్కొక్క మెడికల్ కాలేజీకి రూ.510 కోట్లు చొప్పున, రూ.4080 కోట్లు మంజూరు చేశారు. ఎనిమిది కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతి తేవడానికి అధికారులు చాలా కృషిచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 850 మెడికల్ సీట్లు ఉన్నాయి. ఇప్పటికీ 2902 సీట్లకు పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆ నాటి పాలకులు వైద్య విద్యను చిన్నచూపు చూశారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో మెడికల్ సీట్లను 3.2 రెట్లు పెంచాం. రాష్ట్రంలో ప్రభుత్వం, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 6540 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి." -  మంత్రి హరీశ్ రావు 


Also Read : Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా


Also Read : Congress Presidential Elections : హైదరాబాద్ వచ్చిన శశిథరూర్‌కు షాకిచ్చిన రేవంత్ - ఆనాటి గొడవలో రివెంజ్ తీర్చుకున్నట్లేనా !?