మునుగోడుకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మునుగోడులో బీజేపీనే ఘన విజయం సాధించబోతోందని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ సిద్ధంగా, భారీ మెజారిటీతో గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ను దేశంలో ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు. బీజేపీని ఓడిస్తానని కేసీఆర్ ఉత్తర కుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టినట్లు, అప్పుడే కేసీఆర్ ప్రధాని అయిపోయినట్లు కేటీఆర్ సీఎం అయినట్లు, కవిత కేంద్ర మంత్రి అయినట్లుగా కల్వకుంట్ల కుటుంబం ఫాం హౌజ్ లో పడుకొని పగటికలలు కంటోందని ఎద్దేవా చేశారు.


ఎంఐఎంను బలోపేతం చేయడానికే కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్‌కు అసదుద్దీన్‌ ఒవైసీ బుల్లెట్ బండిపై నేరుగా వెళ్లే స్వేచ్ఛ ఉందని గుర్తు చేశారు. టీఆర్ఎస్‌ కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమే అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త పార్టీ పెడుతున్నారంటూ విమర్శించారు. కేసీఆర్ ఏ లక్ష్యంతో కొత్త పార్టీ పెడుతున్నారో టీఆర్ఎస్ నేతలే అర్థంకాక తలలు పట్టుకుంటున్నారని కేంద్రమంత్రి అన్నారు. టీఆర్ఎస్ కు ఇప్పుడు ఉన్న 8 సీట్లతో ఎలా చక్రం తిప్పుతారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి నిద్రలోనూ ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.


మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ - టీఆర్ఎస్ కలిసి కుట్ర చేసే అవకాశం ఉందని కిషన్ రెడ్డి మాట్లాడారు. కమ్యూనిస్టుల సానుభూతి పరులంతా కేసీఆర్ కుటుంబ పాలనపై వ్యతిరేకతతో ఉన్నారని వాళ్ల మనసు అంతా మోదీపైనే ఉందని అన్నారు. ఈ మునుగోడు ఎన్నిక కల్వకుంట్ల కుటుంబ పాలనకు ఒక రిఫరెండమ్ లాంటిది అని తెలిపారు.






మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల


ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 7 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబరు 6 న కౌంటింగ్ ఉండనుంది.


తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన చోట్ల కూడా ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు కూడా ఇదే సమయంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 


ముఖ్యమైన తేదీలు



  • ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022

  • నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022

  • నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022

  • పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022

  • కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022