కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు సాయం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ముందుకొచ్చింది. కోవిడ్ క్రైసెస్ సపోర్ట్ (Covid Crisis Support) పేరుతో స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు వెల్లడించింది. అర్హులైన వారు అక్టోబర్ 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది.
దీని ద్వారా మొత్తం 3,200 మంది విద్యార్థులకు రూ.9 కోట్ల సాయం అందించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ కార్యక్రమాల్లో ఒకటైన పరివర్తన్ లో భాగంగా వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. పాఠశాల విద్యార్థులు, యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు చదువుతున్న వారికి కూడా వీటిని అందించనున్నట్లు తెలిపింది. ఈ స్కీమ్ ద్వారా రూ.15,000 నుంచి రూ.75000 వరకు ఆర్థిక సాయం అందించనుంది.
అర్హతలు ఇవే..
1. కోవిడ్ కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన విద్యార్థులు
2. కుటుంబాన్ని పోషించే వ్యక్తి (లేదా వ్యక్తులు) జీవనోపాధి కోల్పోయిన సందర్భంలో వారి పిల్లలు
పై రెండు కేటగిరీలకు చెందిన విద్యార్థులకు సాయం అందించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబ వార్షిక కుటుంబ ఆదాయం ఏడాదికి రూ. 6 లక్షలకు మించకూడదని పేర్కొంది.
ఈ స్కాలర్‌షిప్‌ల ద్వారా పాఠశాల విద్య (ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు) చదువుతున్న 1800 మంది విద్యార్థులకు, కాలేజీ (డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ కోర్సులు) విద్యను అభ్యసిస్తున్న 1400 మందికి సాయం అందించనుంది. స్కాలర్‌షిప్ ఫండ్‌ను హాస్టల్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పుస్తకాలు, ఆన్‌లైన్ లెర్నింగ్ పరికరాలు మొదలైన వాటిని కొనుక్కునేందుకు ఉపయోగించుకోవచ్చు.
దరఖాస్తు చేసుకోండిలా..
బడ్డీ 4 స్టడీ ఇండియా (Buddy4Study India) ఫౌండేషన్ సహకారంతో ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది. విద్యార్థులు మొదట బడ్డీ 4 స్టడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి వారి ఈమెయిల్, ఫోన్ నంబర్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం అందులో ఉన్న ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి.. అవసరం అనుకున్న డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
గతేడాది మార్క్ షీట్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, అడ్మిషన్ లెటర్, ఫీజు రిసీప్ట్ లేదా స్కూల్, కాలేజీ ఐడెంటిటీ కార్డు, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం, ఉద్యోగం కోల్పోయినట్లయితే, తల్లిదండ్రులు మునుపటి ఉపాధికి రుజువు, వారి బ్యాంక్ ఖాతా వివరాలు, కుటుంబ ఆర్థిక పరిస్థితికి సంబంధించి పాఠశాల ఉపాధ్యాయుడు, వైద్యుడు మొదలైనవారి నుంచి రిఫరెన్స్ లెటర్ వంటి డాక్యుమెంట్లను ఆన్‌లైన్ విధానంలో ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ స్కాలర్‌షిప్‌లకు అర్హుల ఎంపిక ప్రక్రియ పలు దశల్లో ఉంటుంది. గతేడాది అభ్యర్థులకు వచ్చిన మార్కులు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి వంటి వాటి ఆధారంగా అర్హులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌లను ఒకేసారి మంజూరు చేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. తర్వాత సంవత్సరాలకు కొనసాగింపు ఉండదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 011-430-92248 నంబరును కానీ hdfcbankecss@buddy4study.com ఈమెయిల్‌ను కానీ సంప్రదించవచ్చు.