ఢిల్లీ యూనివర్సీటీలో యూజీ, పీజీ, పీహెడీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఢిల్లీ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (DUET-2021)కు సంబంధించిన తేదీలను విడుదల చేసింది. DUET పరీక్షలు సెప్టెంబర్ 26, 27, 28, 29, 30, అక్టోబర్ 1 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ (ఎగ్జామ్స్) డాక్టర్ సాధనా పరాషార్ వెల్లడించారు. 
ఢిల్లీ యూనివర్సిటీలో పోస్టు గ్రాడ్యుయేట్, ఎంఫిల్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 21తో ముగియనుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 2వ తేదీన ప్రారంభం అవుతుంది. గడువు ఆగస్టు 31తో ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం ఎన్టీఏ, ఢిల్లీ యూనివర్సిటీల అధికారిక వెబ్ సైట్లను సందర్శించవచ్చు. 
దరఖాస్తు ఫీజు వివరాలు.. 
పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.300 చెల్లించాలి. మిగతా వారు రూ.750 చెల్లించాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ లా (పీజీడీఎస్ఎల్- PGDSL) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే వారిలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.1500, మిగతా వారు రూ.2000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. 
ఎంఫిల్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.300, మిగతా వారు రూ.750 చెల్లించాలి. 
వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు ఐకార్ నోటిఫికేషన్‌
వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, జేఆర్‌ఎఫ్‌, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) ఆలిండియా ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ (ఏఐఈఈఏ- AIEEA) నోటిఫికేషన్ విడుదల అయింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ  ఏఐఈఈఏ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కంప్యూటర్‌ ఆధారిత  పరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. 
యూజీ కోర్సులకు ఇంటర్‌/10+2 ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. మిగతా కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు స్వీకరణ ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను సెప్టెంబర్‌లో విడుదల చేస్తారు. యూజీ కోర్సులకు పరీక్షలు సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరగనున్నాయి. ఇక పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు సెప్టెంబర్‌ 17న పరీక్షను నిర్వహిస్తారు. మరిన్ని వివరాల కోసం https://icar.nta.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. 
ఈ పరీక్ష ద్వారా 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చరల్‌, ఫిషరీస్‌ వర్సిటీలు, 4 ఐసీఏఆర్‌ డీమ్డ్‌ వర్సిటీలు, 3 సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ వర్సిటీలు, 4 సెంట్రల్ల్‌ వర్సిటీల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ (పీహెచ్‌డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.